‘గ్రేటర్ హత్యలు’ : మనుషుల్ని మింగుతున్న గుంతలు!

హైదరాబాదు నగరంలో వర్షాలు రావడం కొత్త కాదు. వర్షాలకు రోడ్లు దెబ్బతినడం కూడా కొత్త కాదు. కానీ, దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడం కనీసం జనరవాణాకు యోగ్యంగా త్వరితగతిన తయారుచేయడంలో మునిసిపల్ అధికారులు కనబరుస్తున్న నిర్లక్ష్యం , చేస్తున్న జాప్యం మాత్రం దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయంటే.. కేవలం రోడ్ల మీది గోతులు జనం ప్రాణాలను మింగేస్తున్నాయి. హైదరాబాదు కూకట్పల్లి లోని వై జంక్షన్ వద్ద.. శుక్రవారం ఉదయం రోడ్ల మీద గోతుల కారణంగా బైక్ అదుపు తప్పి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అధికారికంగా నమోదైన లెక్కల ప్రకారం.. గత వారం రోజుల్లో నగరంలో గోతుల వల్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు.
ఈ చావులకు ఎవరు బాధ్యత వహించాలి. సూటిగా చెప్పాలంటే.. జీహెచ్ఎంసీ నగర పాలక సంస్థ చేసిన హత్యలుగా వీటిని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఎక్కడైనా సరే.. వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు దెబ్బతింటూనే ఉంటాయి. దాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరు. కానీ వర్షాలు ఆగిపోయి నెలరోజులు అవుతోంటే.. ఇప్పటికీ రోడ్ల మీద గోతులు అలాగే ఉండడాన్ని జనం ఎలా అర్థం చేసుకోవాలి. దీనిని కార్పొరేషన్ వారి అహంకారం అని కాకుండా మరో రకంగా ఎలా పరిగణించాలి.
నాలాల మీద ఆక్రమణలు ఉండడం వల్ల వర్షాకాలంలో ఇబ్బందులు వచ్చాయని తాజాగా ఇప్పుడే గుర్తించినట్లుగా జీహెచ్ఎంసీ వ్యవహరించింది. సరే , ఎప్పటికో ఒకప్పటికి స్పందించారనే అనుకుందాం. వర్షాలు ఆగీ ఆగగానే.. సిబ్బందిని, మెషినరీని చాలా పెద్దసంఖ్యలో తరలించి.. నాలాల మీద ఉన్న ఆక్రమణల్ని తొలగించే పనులు చేపట్టారు. వందల నిర్మాణాలు కూల్చివేశారు. నిర్మాణాల కూల్చివేతను తప్పుబట్టడం కాదు గానీ.. అంతకంటె రోడ్లను బాగు చేయడం తమ విధి అని అధికారులు గుర్తించకపోవడం దారుణం.
ప్రభుత్వం కోట్లు విడుదల చేస్తే.. ఎవరి వాటాలు వారు కుమ్మేసుకోవచ్చునని ఇన్నాళ్లూ అసలు రోడ్ల సంగతే పట్టించుకోకుండా ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. లేకుంటే.. కనీసం శాఖాపరంగానైనా పనులు చేపట్టి.. పక్కాగారోడ్లను వేయడం సంగతి తరువాత.. ముందుగా.. గోతుల్ని చదును చేసే కనీసం పనులైనా చేపట్టి ఉంటే ఇవాళ ఇన్ని నరబలుల గురించి శోకించాల్సిన దుస్థితి వచ్చేది కాదు. జీహెచ్ఎంసీ అనేది జనానికి మేలు చేయడానికి ఉందా? జనం ప్రాణాలను కబళించడానికి ఉన్నదా? అనే సందేహం ప్రజలకు రాకుండా వారి పాలన సాగాలి.

