కేబినెట్ విస్తరణకు వైకాపా వ్యూహాత్మక బ్రేకులు!

‘‘మాకు ఎటూ అవకాశం లేదు , కానీ అవతలి వాడు మాత్రం బాగు పడడానికి మాత్రం వీల్లేదు. మనకు ఏ చిన్న అవకాశం దొరికినా అవతలి వారికి గల అదృష్టాన్ని తొక్కేయాల్సిందే’’ అనే సిద్ధాంతం కిందికి ఈ వ్యవహారం వస్తుందో లేదో పాఠకులే నిర్ణయించుకోవాలి. అయితే విషయం ఏంటంటే.. తమ పార్టీ నుంచి తెలుగుదేశం లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందే అవకాశం లేకుండా బ్రేకులు వేయడానికి, వ్యూహాత్మకంగా నైతిక విలువలను తెరమీదికి తెచ్చి అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు కేబినెట్ విస్తరణ చేపట్టబోవడం బాగా దగ్గర పడిన నేపథ్యంలో.. తమ పార్టీ నుంచి వెళ్లిన వారికి మాత్రం మంత్రి యోగం పట్టకుండా చూడాలని వైకాపా ఓ వ్యూహాన్ని అనుసరిస్తోంది.
గవర్నరుకు నైతికవిలువలను ముడిపెట్టడం ద్వారా అటునుంచి నరుక్కురావాలని వైకాపా యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాసయాదవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించినందుకు గవర్నరు తీరును తెలంగాణ తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. ఏపీలో కూడా తిరిగి గవర్నరు అదే పని చేయడానికి, అదే తరహా విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధమా అని ముందునుంచే ప్రచారంలోకి తేవడం ద్వారా బ్రేకులు వేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా చూస్తోంది.
వైకాపా నుంచి ఫిరాయించిన కొందరికి అనివార్యంగా మంత్రి పదవులు ఇచ్చేలా చంద్రబాబు ముందే అంగీకరించినట్లు సమాచారం. వారిలో భూమా నాగిరెడ్డి కుటుంబం, తదితరులు ఉన్నారు. అయితే గవర్నరు కు నైతిక విలువలను ముడిపెడితే.. బ్రేకులు వేయడం కుదురుతుందని వైకాపా అనుకుంటోంది. అదే సమయంలో.. తెలుగుదేశం మాత్రం తెలంగాణ ప్రభుత్వంలో చేసిన పనిని, ఆంధ్రప్రదేశ్‌లో చేయడానికి గవర్నరుకు అభ్యంతరం ఎందుకుంటుందని, కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబునాయుడు అనుకున్నట్లుగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

