ఇరుకున పెట్టడమే ప్రొఫెసర్ సాబ్ లక్ష్యం !

తెలంగాణ లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో విపక్షాల కంటే జేఏసీ నాయకుడిగా ప్రొఫెసర్ కోదండరాం పోషిస్తున్న పాత్ర చాల ఎక్కువగా ఉంటోంది. రాజకీయ పార్టీలు ప్రతి అంశం మీద ఒక సీజన్లో హడావిడి చేసి ఆ తరువాత సైలెంట్ అయిపోవడం అందరికీ తెలిసిందే. కానీ ఐకాస నాయకుడిగా ప్రొఫెసర్ కోదండరాం చేస్తున్న ఉద్యమం లేదా పోరాటం లేదా ప్రజా చైతన్య కార్యక్రమం తీరు ఆ రకంగా ఉండడం లేదు. అయన ప్రజల్లోకి వెళుతూ, అక్కడినుంచి సేకరిస్తున్న సమాచారంతోను, నిపుణుల నుంచి తెప్పిస్తున్న విశ్లేషణలతోను జమిలిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పోకడల్ని తప్పుపడుతూ ఏకంగా ఒక పుస్తకాన్నే ఆవిష్కరించారు.
ప్రాజెక్టులను వ్యతిరేకించడం తమ లక్ష్యం కాదంటూనే, కలిగించే ప్రయోజనం కంటే .. కాగల వ్యయం, భారం చాల ఎక్కువ అయినప్పుడు వాటికీ దూరంగా ఉండడమే మంచిదని కోదండరాం బృందం సూచిస్తోంది. కాళేశ్వరం పేరుతో అనవసరపు భూసేకరణను కూడా వ్యతిరేకిస్తోంది. ఆచరణాత్మకంగా ఉండగల అనేక మంచి సూచనలను నిపుణుల సాయంతో వీరు చేస్తున్నారు.
ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన విరుచుకు పడిపోయే, హరీష్ రావు మరియు తెరాస దళాలకు కోదండరాం ప్రయత్నాలు చికాకు పుట్టించవచ్చు. అయితే వారు అడ్డంగా విమర్శించడం కాకుండా, అయన లేవనేతే సందేహాలకు సమాధానాలు చెబితేనే ప్రజల మన్నన పొందగలుగుతారు.
అదేసమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించాలనే ప్రయత్నాలకు కూడా విఘాతం కలగవచ్చు. కేంద్రం ఈ మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే గనుక కెసిఆర్ సర్కారుకు ఇబ్బందే అవుతుంది.

