అమిత్ షా గారూ.. ఏం సెప్తిరి ఏం సెప్తిరీ...!!

నల్లధనం నియంత్రణ పేరుతో పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో మోదీ సర్కారు మీద ప్రధానంగా ఒక విమర్శ వినిపిస్తోంది. విపక్షాలు విమర్శించడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటాయన్నది నిజమే. కాకపోతే.. విపక్షాల్లో అందరూ ఈ విమర్శను పదే పదే అంటూ ఉండడం వల్ల అది ప్రజల్లోకి కూడా వెళుతోంది. ఈ విమర్శ ద్వారా తమ ప్రభుత్వానికి లేదా పార్టీకి అంటే మకిలిని కడిగేసుకోవాలనుకున్నారేమో.. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు అందరూ కూడా తమ తమ బ్యాంకు ఖాతాల వివరాలను ప్రకటించాలంటూ అమిత్ షా జీ ఒక హుకుం జారీ చేశారు. అయితే అమిత్ జీ ఇచ్చిన ఆదేశాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ‘అమిత్ షా గారూ ఏం సెప్తిరీ .. ఏం సెప్తిరీ’ అంటూ వెటకారాలాడుతున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే...
నవంబరు 8వ తేదీనుంచి డిసెంబరు 31 వ తేదీ వరకు ఉండే బ్యాంకు ఖాతాల వివరాలను భాజపాకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ వెల్లడించాలని అమిత్ గారు ప్రకటించారు.
అయితే వాస్తవానికి భాజపా వారి మీద వెల్లువెత్తుతున్న ఆరోపణ ఏమిటి? ‘‘మోదీ నోట్ల రద్దు చేయబోతున్న సంగతి భాజపా కు చెందిన నాయకులందరికీ 8వ తేదీ కంటె ముందే తెలుసు. వాళ్లంతా తమ తమ నల్లడబ్బును చక్కగా సర్దుబాటు చేసుకున్నారు. ఆ తర్వాతే మోదీ నోట్ల రద్దును ప్రకటించారు’’ అనేది అసలు ఆరోపణ. ఈ ఆరోపణ నుంచి తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే అమిత్ షా ఏం చేయాలి? నవంబరు 8వ తేదీకి ముందు ఆరునెలల బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ను బహిరంగం చేయమని తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరికీ పురమాయించాలి. కేవలం ఎమ్మెల్యే, ఎంపీగారు మాత్రం బ్యాంకు ఖాతా వివరాలు చెబితే చాలదు. వారి కుటుంబ సభ్యులందరి బ్యాంకు ఖాతాల వివరాలను గత ఆరునెలల బ్యాలెన్స్ షీట్ ను బయటపెట్టాలి. అలా చేస్తేనే వారి నిజాయితీ బయటపడుతుంది తప్ప... నవంబరు 8 తర్వాత బ్యాంకు ఖాతాలు బయటపెడితే ఏం తెలుస్తుంది అని జనం నవ్వుతున్నారు.
అమిత్ షాకు తమ పార్టీ వాళ్లంతా నిజాయితీ పరులని, సత్యసంధులని గుర్తింపు పొందాలనే తపన ఉంటే ఉండవచ్చు... కానీ అందుకు ఆయన నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటే జనం నమ్ముతారు గానీ.. ఏదో మొక్కుబడిగా ఓ మాట ప్రకటించి బుకాయించాలని చూస్తే.. ఆయనే నవ్వులపాలు అవుతారు.

