వైసీపీ దీక్ష ఎఫెక్ట్ ఎంత..?

ఏపీ సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేయాలనే డిమాండ్ల తో కేంద్రంపై పోరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన దైన శైలిలో దీక్షలు, పోరాటాలు, సైకిల్ యాత్రలు చేస్తున్నారు. వీటి మూలంగా కేంద్రం దిగివస్తుందని బాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన పుట్టిన రోజునాడు చేసిన దీక్షలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఆయన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని మోడీ కేంద్రంగా విరుచుకుపడ్డారు. ఇక, మరింతగా తన దూకుడు పెంచే క్రమంలోనే సోమవారం చంద్రబాబు తిరుపతిలో ధర్మ దీక్ష సభకు సిద్ధమయ్యారు. దీనిని భారీ రేంజ్లో నిర్వహిస్తున్నారు.
వంచన వ్యతిరేక దీక్షతో.....
ఈ పోరాటం ద్వారా కేంద్రం దిగిరావాలని బాబు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. అయితే, దీనిని తీవ్రంగా వ్యతిరేకి స్తున్న విపక్షం వైసీపీ.. చంద్రబాబును తీవ్రస్థాయిలో దుయ్యబడుతోంది. ముఖ్యంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో బాబుపై ఫైరయ్యారు. బాబు దాదాపు 3 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించా రు. సోమవారం విశాఖపట్నం వేదికగా చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో విజయసాయి పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని శపథం చేశారు. దేశంలోని హవాలా, విదేశాల్లోని ఆర్మ్డ్ డీలర్స్‌తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొండపైన బీజేపీతో.....కింద కుస్తీనా?
2014 ఏప్రిల్ 30న తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభకు, ఈ ఏడాది ఏప్రిల్ 30న చేపట్టిన సభ లక్ష్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయని అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్నది ‘ధర్మపోరాటదీక్ష’ కాదని, అదొక అధర్మ సభ అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై వంచనకు పాల్పడుతున్న చంద్రబాబు ఈ సభను చిత్తశుద్ధితోనే నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించా రు. కొండపైన బీజేపీతో టీడీపీ జట్టు కడుతూ.. కొండ కింద కుస్తీ పడుతోందన్నారు. టీటీడీ బోర్డులో బీజేపీ నేత భార్యకు అవకాశం కల్పించారని, ఇది ధర్మమా? న్యాయమా? అని మీరే ప్రశ్నించుకోండి అన్నారు. ఇక, ఈ సందర్భంగా ఆయన వంచన వ్యతిరేక దీక్ష ప్రారంభించారు. నిజానికి సోమవారం చంద్రబాబు నిర్వహిస్తున్న ధర్మ దీక్ష సభకు యాంటీగా ఈ సభ ఉంది. అయితే, దీని ఎఫెక్ట్ బాబుపై ఎంత మేరకు పడుతుందనే చూడాలి. ఇప్పటి వరకు అయితే, అటు టీడీపీ, ఇటు వైసీపీలు రెండూ సమానంగానే తమతమ పోరాటాలు సాగిస్తుండడం గమనార్హం.