కోవర్టుల భయం....!!!

రాజకీయాల్లో కోవర్టులతో పెద్ద ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. ప్రధానంగా ముఖ్య పార్టీలకు ఈ కోవర్టులు ప్రాణసంకటంగా మారారు. నిన్న మొన్నటి వరకు ఏపీ అదికార పార్టీలో కొవర్టులు ఉన్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి. ప్రధానంగా జనసేనకు సంబంధించిన కోవర్టులు ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. ఏకంగా మంత్రులపైనే ఈ అనుమానాలు రావడం గమనార్హం. గతంలో ప్రజారాజ్యం తరఫున గెలిచి.. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి.. టీడీపీలో మంత్రి అయిన ఓ నాయకుడిపై కోవర్టు అనే ముద్రపడింది. ఇక, ఆయా పార్టీల్లో తీవ్ర అసంతృప్తులుగా ముద్రపడిన వారు కూడా చాలా మంది కోవర్టులుగా మారిపోయారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కట్ చేస్తే.. ఇలాంటి కోవర్టుల మూలంగా తెలంగాణాలో తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఈ కోవర్టులు విజృంభించారని, రాజకీయాలను ప్రభావితం చేశారని, ఎన్నికల సరళిని సైతం మార్చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రత్యర్థులకు సహకరించారా?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సొంత పార్టీలో ఉండి పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేస్తున్నట్లు నటిస్తూ ప్రత్యర్థి పార్టీకి సహకరించేం దుకు ప్రయత్నించిన కోవర్టులపై ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ప్రచారం, ఇతర ప్రక్రియ దాదాపు 100 రోజులు కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, అభ్యర్థులు బిజీగా ఉన్న సమయంలో ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకులతో టచ్లో ఉండడం, ఒక పక్క ఒక అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తున్నట్టు నటించి, మరో అభ్యర్థికి రహస్యంగా స్నేహహస్తం అందించడం లాంటి కార్యక్రమాలకు పాల్పడిన వారు కూడా ఉన్నారని నాయకులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో అలాంటి కోవర్టులపై తక్షణ చర్యలకు దిగితే మరింత నష్టం జరిగే అవకాశం ఉందనే భావనతో కొందరిని పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు భరిస్తూ వచ్చారు.
ఏపీలోనూ అదే పరిస్థితి అయితే.....
దీంతో ఇప్పుడు ఈ కోవర్టుల విషయం ప్రధానంగా చర్చకు వస్తోంది. ఏపీలోనూ ఇదే పరిస్థితి ఎదురైతే.. అటు అధికార పక్షం టీడీపీ, విపక్షం వైసీపీలు కూడాతీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల్లోనూ సీట్లు లభించని నాయకులు చాలా మందే ఉన్నారు. అధినేత వైఖరులతోనూ విసిగిపోయిన వారు కూడా మనకు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో వీరంతా కోవర్టులుగా మారితే.. పరిస్థితి ఏంటి? తెలంగాణాలో మాదిరిగా ఏపీలోనూ ఎన్నికలపై వీరి ప్రబావం పడితే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. మరో నాలుగు మాసాల్లోనే ఏపీ పోరుకు తెరలేవనుంది. ఇది తెలంగాణా ఎన్నికల కురుక్షేత్రాన్ని మించిన స్థాయిలో జరుగుతుందని ఇప్పటికే అంచనాలు వస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలు, ముగ్గురుకీలక నేతల సత్తాపై ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణాలో చూసుకుంటే కేవలం ఒక వ్యక్తి ప్రాతిపదికగా ఎన్నికలు జరిగాయి. కానీ, ఏపీలో త్రిముఖ పోటీ ఉండనుంది. దీంతో కోవర్టులకు ఎక్కువ అవకాశం, ఆస్కారం కూడా ఉండనుంది. మరి దీనిని ముందుగానే గ్రహించి నాయకులు వారిని కట్టడి చేస్తారో.. బుజ్జగిస్తారో చూడాలి.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- coverts
- indian national congress
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కోవర్టులు
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- ిrahul gandhi