Sun Oct 06 2024 01:24:32 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ పొత్తు ఓకే.. మరి ఇక్కడ?
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలవుతూనే కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులని ప్రకటించేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల సంక్షోభం నెలకొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా ఎన్డీయే నుంచి వైదొలిగి టీడీపీతో పొత్తు ప్రకటించి
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలవుతూనే కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులని ప్రకటించేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల సంక్షోభం నెలకొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా ఎన్డీయే నుంచి వైదొలిగి టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల ఘంటికలను మ్రోగించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని పరిణామంగా మారింది. ఇన్నేళ్ళ పాటు బద్ధ శత్రువులలా కొట్లాడుకున్న టీడీపి, జనసేన నేతలు, కార్యకర్తలు అన్నదమ్ములలా కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సర్కార్‌ను కూల్చడమే ముచువల్ ఇంట్రెస్ట్‌గా ఉన్న ఇరుపార్టీలూ పరస్పర మనస్పర్ధలకు చెక్ పెట్టి తాత్కాలిక దోస్తీకి సై అంటున్నారు. ఇంతవరకూ బాగుంది..
ఈ రెండు వర్గాలూ ఎన్నాళ్ళు దోస్తీ నిభాయిస్తాయి? చంద్రబాబు నాయుడు జైల్ నుంచి విడుదలయ్యేవరకా? వచ్చే ఎన్నికల వరకా లేక ఒకవేళ పొత్తులో గెలిచాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏలినంత కాలమా? టీడీపీ జనసేన పొత్తుని జనసేన అధినేత ప్రకటించినా.. టీడీపిలోని ఓ వర్గం అన్యమనస్కంగానే ఉంటోంది. పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్రలో జనసేన కార్యకర్తలే కనిపిస్తున్నారు కానీ టీడీపి వాళ్ళు కనిపించడం లేదు. తన సామ్రాజ్యం, తన కుటుంబం, తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒక అడుగు దిగి వచ్చినా.. టీడీపి క్యాడర్, లీడర్లు మాత్రం అందుకు అంగీకరించడం లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ ఇరవై రోజుల కాలంలో పవన్ కళ్యాణ్ ని కలిసిన తెదేపా లీడర్లు మహా అయితే ఓ పదిమంది కూడా లేరు.
ఆంధ్రలో పొత్తుల వ్యవహారం అలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల కోసం జనసేన మొదటి జాబితా విడుదల చేసింది. 32 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ 32 స్థానాలూ అధికార పార్టీకి కష్టంగా ఉన్నవిగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ పై, సీఎం కేసీఆర్ పై తీవ్రమైన వ్యతిరేకత కలిగి ఉన్న నియోజకవర్గాలుగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీని ఆ ప్రాంతాలలోనే ముందస్తుగా ప్రకటించడం వెనుక పవన్ కళ్యాణ్, కేసీఆర్‌ల మతలబు దాగి ఉందా అనిపిస్తుంది. ఆంధ్రలో టీడీపితో పొత్తు పెట్టుకున్న జనసేన.. తెలంగాణలో టీడీపి పేరును ఎత్తడం లేదు. జనసేన పోటీ చేస్తున్న 32 ప్రాంతాల్లోనూ కమ్మ, కాపు, యూత్ ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యక్షంగా పేరు తీయకపోయినా.. ఆంధ్రలో ప్రకటించిన పొత్తువల్ల తెలంగాణలోనూ టీడీపి ఓట్లు జనసేనకు పోలరైజ్ అవుతాయనే ఆలోచన పవన్ కళ్యాణ్ కలిగి ఉన్నారా అనిపిస్తోంది. ఒకవేళ బహిరంగంగా పొత్తును ప్రకటిస్తే జనసేనకు తెలంగాణలో సంఖ్యాబలం తగ్గే అవకాశాలున్నాయా? తెలంగాణ సెంటిమెంట్‌కు వ్యతిరేకి అనిపించుకున్న టీడీపితో బహిరంగంగా పొత్తును ప్రకటిస్తే ఆ పార్టీకి పట్టిన గతే తమకు పడుతుందని జాగ్రత్త పడుతున్నారా? అంటే.. అవుననే అనిపిస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్‌లో కొత్త జోష్ నెలకొన్న తర్వాత పాత టీడీపి క్యాడర్ చాలావరకూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఓ మోస్తరు ఓట్ బ్యాంక్ కలిగిన టిడీపి ఈసారి తెలంగాణ ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేయనుందా అన్న అనుమానం కూడా రేగుతోంది.
ఈ కారణాల వల్ల టీడీపి పేరు చెప్పకుండా తమ పార్టీ నుంచి సొంతంగా 32 మంది అభ్యర్థులను ప్రకటించిన జనసేన తీరుపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ముందస్తు జాగ్రత్తనా లేక రెండు నాలుకల ధోరణా.. కాలమే సమాధానం చెప్తుంది.
Next Story