ఆయన అపరిచితుడేనా !!

విశాఖ అర్బన్ జిల్లా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు పెన్మత్స విష్ణుకుమార్రాజు విక్రం అపరిచితుడు సినిమాను తలపిస్తున్నారు. ఆయన పోకడలు చూస్తుంటే ముందు చెప్పింది తరువాత ఉండదన్న విమర్శలు గట్టిగానే ఉన్నాయి. ఓసారి పొగుడుతారు. మరోసారి తెగుడుతారు. అయన వైఖరి సొంత పార్టీ నాయకులకే అంతు పట్టడం లేదిపుడు.
బాబుపైన మళ్ళీ....
లేటేస్ట్ గా విష్ణుకుమార్రాజు చంద్రబాబు పై ఘాటుగా విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాను ముంచెత్తిన తిత్లీ తుపాను ఆర్ధిక సాయంపై అంచనాలు పెంచేశారని కామెంట్స్ చేశారు. ఇలా ఎక్కువగా చెప్పి కేంద్రం ఎంత సాయం చేసినా తక్కువ ఇచ్చారని ప్రచారం చేసుకోవడానికేనని కూడా ఆయన విమర్శించారు. అంతటితో ఆగకుండా బాబుకు ఇది అలవాటేనని కూడా సెటైర్లు వేశారు. కేంద్రం ఏపీకి ఎంతో సాయం చేస్తోందని వెనకేసుకొచ్చారు.
అసెంబ్లీలో అలా......
దీనికి సరిగ్గా నెల రోజుల ముందు కేంద్రం విభజన హామీలు ఏవీ నెరవేరలేదంటూ టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెడితే మరో మాట లేకుండా ఆమోదించిన బీజేపీ నాయకుడాయన. తన పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీ తిడుతూ తీర్మానం పెట్టినా.. ఓకే ...అన్న రాజు గారు అప్పట్లో చేసిన కామెంట్స్ ని కూడా మరచిపోలేం. రేపు ఏమవుతుందో, నేను ఏ పార్టీలో ఉంటానో అంటూ రాజు గారు ఇంటెరెస్టింగ్ కామెంట్స్ చేసి రక్తి కట్టించారు.
బాబుని పొగిడిన వేళ....
చంద్రబాబుని అసెంబ్లీలో ఆయన పుట్టిన రోజు వేళ పొగిడిన రాజు గారు ఏకంగా సినీ హీరో శోభన్ బాబు తో పోల్చారు. అందగాడు అంటూ కితాబులూ ఇచ్చారు. బాబు వంటి కష్టపడే నాయకుడు వేరొకరు లేరని చాలా సార్లు అన్న ఆయన... అదే నోటితో ఈ ముఖ్యమంత్రి పాలన సరిగా లేదంటూ అనేక సంధర్భాలలో వ్యాఖ్యానించారు. పోలవరం, పట్టిసీమల్లో అవినీతి పారిందని చెప్పిన రాజుగారు పోలవరం టూర్ కు టీడీపీ సర్కార్ వేసిన బస్సుల్లోనే వెళ్ళి భేష్ అని పొగడడమూ అంతా చూశారు.
.జగన్ విషయంలోనూ.....
మరో వైపు ప్రతిపక్ష నాయకుడు జగన్ విషయంలోనూ రాజు గారు ఎన్నో సార్లు నాలుక మడతేశారు. జగన్ వంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం బాధాకరమని చెప్పిన నోటితోనే జగన్ సమర్ధుడు, బలమైన నాయకుడంటూ కీర్తించారు. అంతటితో ఆగకుండా జగన్ విశాఖ పాదయాత్రకు వస్తే కలుస్తానని, తమ కుటుంబంలో జగన్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకొచ్చారు. మరి ఇలా సమయానికో మాట మాట్లాడుతూ విష్ణుకుమార్రాజు తనను తాను పలుచన చేసుకుంటున్నారా లేక ఇది కూడా ఓ వ్యూహమేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలకు కలుగుతున్నాయి. ఇక ఇపుడు బాబుని నిందించిన ఆయన రేపు మళ్ళీ పొగిడినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. సో.... రాజు గారిలో అపరిచితుడు ఉన్నాడేమోనని కమలనాధులకూ డౌట్ వస్తోంది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- prajasankalpa padayathra
- telugudesam party
- vishnu kumar raju
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- విష్ణుకుమార్ రాజు
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
