నెలూరులో మళ్లీ వైసీపీ పాగా.. వేమిరెడ్డి ఎఫెక్ట్.. !

రాజకీయంగా సంచనాలకు కేరాఫ్‌గా మారిన నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీకి మరోసారి కూడా పెను దెబ్బ తగలనుందా? ఆపార్టీకి రాజకీయంగా ఇప్పటికే ఇబ్బంది కర పరిణామాలు ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి కూడా ఇబ్బందులు తప్పవా? ఈ ప్రశ్నలకు ఔననే అంటున్నారు పరిశీలకులు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఎక్కువ. అటు టీడీపీకి, ఇటు వైసీపీకి కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలు, ఓటర్లే కీలకం. 2014 ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ భారీ మెజారిటీ లభించింది. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో టీడీపీ కేవలం 3 స్థానాల్లోనే గెలుపొందగా.. మిగిలిన ఏడు స్థానాలు సహా నెల్లూరు ఎంపీ సీటును కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఈ మూడు సీట్లు కూడా వైసీపీ స్వల్ప తేడాతోనే కోల్పోయింది.
టీడీపీని బలోపేతం చేసేందుకు......
ఇక్కడ వైసీపీ హవా ఉండడంతో చివరకు చంద్రబాబు నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా టీడీపీని ఇక్కడ బలోపేతం చేసేందుకు చంద్రబాబు వ్యూహం అమలు చేశారు. ఎంతో కాలంగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. అయినప్పటికీ.. ఇక్కడ టీడీపీ బలపడే సూచనలు కనిపించడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన కాంగ్రెస్ మాజీ సీనియర్లు.. ఆనం సోదరులు సైతం పార్టీలో కీలకంగా వ్యవహరించలేక పోతున్నారు. ఇక, సోమిరెడ్డి వర్గ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ.. టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
అధికార పార్టీలో విభేదాలు.....
మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇలా అధికార పార్టీలో నేతలు విభేదాలతోనే కాలం వెళ్లబుచ్చుతుండడంతో పార్టీకి ఫ్యూచర్ సంగతి ప్రశ్నగా మారింది. ఇదిలావుంటే, జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తూ.. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. తనకంటూ ఓ వేదికను ఏర్పాటు చేసుకున్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వడంలో చంద్రబాబు వెనుకంజ వేశారు. ఈ పరిణామం కూడా టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. నిజానికి ఆర్థికంగా బలంగా ఉన్న వేమిరెడ్డి పార్టీలో ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు.. నేతలను గెలిపించడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు.
ఎంతకూ తేల్చకపోవడంతో.....
అయితే, రాజ్యసభ టికెట్ విషయంలో చంద్రబాబు ఎంతకీ తేల్చకపోవడంతో కినుక వహించిన వేమిరెడ్డి.. అదేసమయం లో వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్‌ను అందిపుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి రాజ్యసభ సీటుకు ఎంతో మంది పోటీలో ఉన్నప్పటికీ.. వేమిరెడ్డికి పిలిచి పిల్లనిచ్చినట్టుగా రాజ్యసభ టికెట్‌ను అందించారు. ఈ పరిణామంతో నెల్లూరులో వైసీపీ దే మరోసారి హవా నడవ నుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సామాజిక సేవలోనూ....
స్థానికంగా వేమిరెడ్డికి పేరు ప్రఖ్యాతులు ఉండడం, జిల్లా వ్యాప్తంగా ఆయన మాటకు ప్రజలు ఫిదా కావడం, సామాజిక సేవలో ఆయన పేరు మార్మోగుతుండడం, ఆర్థికంగా ఆయన బలంగా ఉండడం వంటి పరిణామాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం ఖాయం. అయితే, ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నందున ఈ పార్టీకే లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. సో.. మొత్తంగా బాబు వేమిరెడ్డి విషయంలో చేసిన పొరపాటు.. పార్టీకి జిల్లాలో పెద్ద దెబ్బే అన్న చర్చలు జిల్లాలో పార్టీలకు అతీతంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం టీడీపీ నుంచి ఉన్న ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వ్యక్తమవుతుండడం కూడా పార్టీకి మరో మైనస్.
