వరదరాజులు రెడ్డి వదిలిపెట్టరా?

నంద్యాల వరద రాజులు రెడ్డి. సీనియర్ నాయకుడు. ప్రొద్దూటూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన ఘన చరిత్ర ఆయనది. అలాంటి వరదరాజులు రెడ్డి తరచూ ఎందుకు ఫైర్ అవుతున్నారు. సొంత పార్టీ నేతలపైనే ఎందుకు కాలు దువ్వుతున్నారు...? వరదరాజులు రెడ్డికి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు మధ్య ఉన్న విభేదాలు ఎందుకు వచ్చాయి? ఒకే పార్టీలో ఉంటూ ఎందుకు గొడవలకు దిగుతున్నారు...? పార్టీ పరువును ఎందుకు బజారుకీడుస్తున్నారు? ఈ విషయాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఐదుసార్లు గెలిచి.....
ప్రొద్దుటూరు అనగానే నంద్యాల వరదరాజులు రెడ్డి మాత్రమే గుర్తొస్తారు. ఆయన ఇప్పటికి ఐదుసార్లు శాసనసభకు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో ఉన్న వరదరాజులు రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఉన్నారు. లింగారెడ్డి చేతిలోనే 2009 ఎన్నికల్లో వరదరాజులు రెడ్డి ఓడిపోయారు. 2014 ఎన్నికలలోనూ వరదరాజులురెడ్డికి టీడీపీ టిక్కెట్ దక్కింది. ఆయన వైసీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాదరెడ్డి చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 1985లో వరదరాజులు రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1989లో కాంగ్రెస్ లోకి మారి మళ్లీ గెలిచారు. 1994, 1999,2004 ఎన్నికల్లో వరుసగా విజయాలను వరదరాజులు రెడ్డి చవి చూశారు.
సీఎం రమేష్ జోక్యంతోనే.....
అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలయిన వరదరాజులు రెడ్డిని చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వరదరాజులు రెడ్డి ఆధిపత్య చేస్తూ వస్తున్నారు. కాని సీఎం రమేష్ జోక్యంతో ఇక్కద వరద సీన్ మారింది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిని సీఎం రమేష్ ప్రోత్సహిస్తున్నారు. వరదరాజులు రెడ్డి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకే నని చెప్పుకుంటున్నారు. సీఎం రమేష్ మాత్రం తానే ప్రొద్దుటూరు అభ్యర్థి ఎవరో ఖరారు చేస్తానని చెప్పడం, లింగారెడ్డి వరదరాజులురెడ్డిపై విమర్శలు చేయడంతో పరిస్థితి మరింత ముదిరింది. వరదరాజులు రెడ్డి వర్గీయుల్లో కొందరిని సీఎం రమేష్ తనవైపుకు తిప్పుకున్నరాన్నది ఆయన ఆరోపణ. లింగారెడ్డికే టిక్కెట్ ఇప్పిస్తానని సీఎం రమేష్ అనేక చోట్ల వ్యాఖ్యానించడం కూడా వరదరాజులురెడ్డి ఆగ్రహానికి కారణమయింది.
కాంట్రాక్టుల విషయంలో.....
ఇక ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించ తలపెట్టిన కుందూ-పెన్నా వరద కావ్ల నిర్మాణ పనులకు సంబంధించ బిల్లులు చెల్లించనీయకుండా సీఎం రమేష్ అడ్డుతగులుతున్నారని కూడా వరద ఆరోపిస్తున్నారు. కొంతకాలం క్రితం ఒక రోడ్డు పనికి సంబంధించి వరదరాజులు కుమారుడు కొండారెడ్డి, సీఎం రమేష్ సోదరులు పోటీ పడటంతో వివాదం మరింత రాజుకుంది. అంతేకాకుండా సీఎం రమేష్ ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించి తనను, తన అల్లుడు, మున్సిపల్ ఛైర్మన్ రఘురామిరెడ్డిని పిలవకుండా లింగారెడ్డి ఆహ్వానించడంతో వరదరాజులరెడ్డి కోపం నషాళానికి అంటింది. అందుకే సీఎం రమేష్ పై ధ్వజమెత్తారంటున్నారు. వీరిమధ్య ఆధిపత్య పోరు ఆగేలా లేదు. ఎవరికి టిక్కెట్ దక్కినా మరొకరు సహకరించరన్నది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఖాయమని తేలిపోయింది. మరి చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
- Tags
- andhar pardesh
- ap politics
- cm ramesh
- kadapa district
- linga reddy
- nara chandrababu naidu
- prodduturu constiuency
- rachamallu prasad reddy
- telugudesam party
- varadarajulu reddy
- y.s. jaganmohan reddy
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కడప జిల్లా
- తెలుగుదేశం పార్టీ
- నంద్యాల వరదరాజులురెడ్డి
- నారా చంద్రబాబునాయుడు
- ప్రొద్దుటూరు నియోజకవర్గం
- రాచమల్లు ప్రసాద్ రెడ్డి
- లింగారెడ్డి
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగెస్ పార్టీ
- సీ.ఎం.రమేష్
