అద్భుతం జరుగుతుందనేనా...?

19 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోటను బద్దలు కొట్టేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. 2019 లో జరిగే ఒడిశా ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని మరోసారి కాపాడుకోవాలని బిజూజనతాదళ్ తీవ్రంగా శ్రమిస్తోంది. అలాగే పట్నాయక్ కంచుకోటను బద్దలు కొట్టాలని కమలనాధులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బలహీన పడిపోయిన కాంగ్రెస్ కూడా ఛత్తీస్ ఘడ్ తరహాలో విజయాన్ని చవిచూడాలని ఉవ్విళ్లూరుతోంది.
కమలం పార్టీ కన్నేసినా....
ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేకపోవడంతో ఒడిశాపై కన్నేశారు కమలనాధులు. ఇప్పటికే ఒడిశాలో కాంగ్రెస్ కంటే బలమైన పార్టీగా కమలం పార్టీ వికసించిందనే చెప్పాలి. స్థానికసంస్థలఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే కాషాయ పార్టీకి కొంత ఇక్కడ గ్రిప్ చిక్కింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఒడిశాలో జేగంట మోగించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించారు. ఈ నెల 24వ తేదీన ప్రధానినరేంద్ర మోదీ ఒడిశా పర్యటనకు రానున్నారు. ఖుర్దా వద్ద బరుణై బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు. మూడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓటమిపాలయిన కమలం పార్టీ శ్రేణులకు నరేంద్ర మోదీ ఉత్తేజం నింపేదుకే వస్తున్నారు.
నవీన్ మాత్రం నింపాదిగా....
ఇక అందరికంటే వ్యూహాల్లో దిట్ట అయిన బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఎన్నికలకు సిద్ధమయిపోయారు. బిజూ జనతాదళ్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కొన్ని నెలల ముందే ఒడిశాలో యాత్రలను ప్రారంభించింది. ప్రజాదర్శన్ పేరుతో నవీన్ పట్నాయక్ సామాన్య ప్రజలకు చేరువవుతూ వస్తున్నారు. దీంతో పాటు ఈ నెల 26వతేదీన బిజూ జనతాదళ్ వ్యవస్థాపక దినోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఈ ఉత్సవాలను భువనేశ్వర్ లోని జనతా మైదానంలో భారీగా నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల నగారాను పట్నాయక్ మోగించనున్నారు. విపక్షాల విమర్శలకు ఇదే వేదిక పై నుంచి పట్నాయక్ సమాధానం చెప్పనున్నారు. అలాగే కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ సందర్భంగా పెద్దయెత్తున పార్టీలో చేరనున్నారని తెలిసింది.
మరో ఛత్తీస్ ఘడ్ లా.....
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ పట్నాయక్ పాలనపై పోరాటానికి సిద్ధమయింది. బిజూ జనతాదళ్ వ్యవస్థాపక దినోత్సవాలను నిర్వహించే ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డే గా పాటించాలని నిర్ణయించింది. నవీన్ పట్నాయక్ తప్పుడు వాగ్దానాలతో పదే పదే అధికారంలోకి వస్తున్నారని, ఈసారి అది చెల్లదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుదర్శన్ దాస్ చెబుతున్నారు. ఒడిశా ప్రయోజనాలను కాపాడటంలో అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న బిజూజనతాదళ్ లు ప్రజలను మోసం చేశాయంటున్నారు. ఛత్తీస్ ఘడ్ తరహాలోనే ఒడిశాలో తాము విజయం సాధిస్తామన్న ధీమాను కాంగ్రెస నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఒడిశాలో ఈ నెలలోనే ఎన్నికల వేడి మొదలయిందంటున్నారు.

