కుమారుడి షాక్ మామూలుగా లేదుగా ...?

తెలుగు రాష్ట్రాల చంద్రులతో కర్ణాటక సీఎం కుమార స్వామికి గట్టి సంబంధాలే వున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాల్లో చక్రం గిరగిరా తిప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటక సర్కార్ మద్దతు తోడు కావాలి. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులు చీటికీ మాటికీ కుమార స్వామి తో టచ్ లోనే వుంటూ వస్తున్నారు. కానీ భవిష్యత్తులో కర్ణాటక ముఖ్యమంత్రి తో ఇద్దరు ముఖ్యమంత్రులు యుద్ధానికి దిగక తప్పని పరిస్థితులు కృష్ణా నది తెచ్చిపెట్టేలా వుంది. కృష్ణా నదిపై ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచడానికి కర్ణాటక అసెంబ్లీ సిద్ధమైంది. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయుక్తంగా లేదా విడి విడిగా కుమార స్వామి సర్కార్ పై ఇంటా బయటా యుద్ధం చేయకతప్పని స్ధితి పొంచి ఉందంటున్నారు విశ్లేషకులు.
ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు...
దాదాపు 30 వేలకోట్ల రూపాయలతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచే ప్రతిపాదనలను కర్ణాటక సిద్ధం చేసేసింది. 1969 లో తొలిసారి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడ్డాక కృష్ణ జలాల నీటి లభ్యత 75 శాతం గా అంచనా వేసింది. కృష్ణాలో 2130 టీఎంసీలు నీరు లభిస్తుంది. ఈ నీటిని కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకున్నాయి . అయితే కాలానుగుణంగా కృష్ణా నదిలో నీటి లభ్యత 75 నుంచి 65 శాతానికి పడిపోయింది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 177 టిఎంసి ల వరకు కర్ణాటక వినియోగించుకోవచ్చు. ఆల్మట్టి నిర్మాణం తరువాత కర్ణాటక 129.72 టిఎంసి లను వాడుకుంటుంది. తాజాగా ఎత్తు పెంచితే మరో 130 టిఎంసి లకు పైగా వాడుకునే అవకాశం లభిస్తుంది. ఇది ట్రిబ్యునల్ తీర్పు కన్నా అధికమే. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు పై సుప్రీం కోర్ట్ లో స్టే వుంది. అయినా కానీ కర్ణాటక తమ పని తాము చేసుకుపోతుంది.
ఎత్తు పెంచితే ఏమౌతుంది ...?
ప్రస్తుతం ఆల్మట్టి ఎత్తు 519. 60 గా వుంది. ఎత్తు పెంపు 524. 256 గా చేయాలని ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. దీనికి తోడు దాదాపు 9 ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు కానున్నాయి. అదే జరిగితే తెలంగాణ లో ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు మట్టికొట్టుకుపోనున్నాయి. ఇక జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిధిలోని రైతాంగానికి గడ్డు పరిస్థితి తలెత్తనుంది. దిగువ ప్రాంతానికి వరదనీరు రావడమే గగనం కానుంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్మట్టి ఎత్తు పెంపు ను వ్యతిరేకిస్తూ యుద్ధం చేయక తప్పదు. మరి తెలుగు చంద్రులు ఎలాంటి అడుగులు వేస్తారు. కర్ణాటక తో తమ రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారా ? లేక తమ రాష్ట్రాల రైతాంగం కోసం పోరాటం చేస్తారా అన్నది వేచి చూడాలి.

