వెస్ట్ వెస్టే : అందరికీ ఆ జిల్లానే కావాలి!

పశ్చిమ గోదావరి జిల్లా.. రాజకీయంగా కూడా చైతన్యవంతమైనదిగా పరిగణించే జిల్లాల్లో ఒకటి. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో నూరుశాతం ఫలితాలు తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే వచ్చాయి. ఎమ్మెల్యేలు, - ఎంపీ స్థానాలు సమస్తం ఆ కూటమి గెలుచుకుంది. ఆ ఫలితాల ప్రభావం ఇప్పుడు భిన్నమైన సమీకరణాలు, పరిణామాలకు దారితీస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు అనుకూలమైన వాతావరణం ఉన్నదంటూ ఎవరికి వారు అనుకుంటున్నారు. ఎవరికి వారు.. పశ్చిమగోదావరి జిల్లా మీద ఫోకస్ పెట్టడానికి, సిద్ధమవుతున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో గెలిచింది రెండు పార్టీలే అయినా పనిచేసింది, ప్రచారం చేసింది మూడు పార్టీలుగా భావించాలి. తెలుగుదేశం, భాజపా, జనసేన కలిసి ప్రచారం నిర్వహించాయి. తెదేపా కూటమి 100 శాతం ఫలితాలు సాధించింది. అయితే ప్రత్యేకించి పశ్చిమగోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి ఎవరికి వారు.. ఇక్కడ లభించిన 100 శాతం ఫలితాలు.. తమ ప్రభావమే అని మురిసిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ మూడు పార్టీలు కూడా ఇక్కడ బలం పెంచుకోవాలని తపన పడుతున్నాయి. ఆరాటపడుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఈ జిల్లానుంచి ఇప్పటికంటె ఎక్కువ రాజకీయ ప్రయోజనం ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాయి.
తెలుగుదేశం : సహజంగానే తమ పార్టీకి ఈ జిల్లాలో బలం బాగా ఉన్నదని వారి అభిప్రాయం. పైగా ఇప్పుడు పరిపాలన పట్ల కూడా ప్రజల్లో సానుకూలత ఉంటుంది గనుక జిల్లా అంతా తమ వశం అయిపోవాలని వారు అనుకుంటున్నారు.
జనసేన : ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను గరిష్టంగా ఆకర్షించడానికి పవన్ కల్యాణ్ ను వాడుకున్నారనే మాట వాస్తవం. అలాంటప్పుడు.. ఈ జిల్లాలో ఆ సామాజిక వర్గం ఓట్లు దండిగానే ఉన్న నేపథ్యంలో ఉన్న ఎడ్వాంటేజీ ఏదో అది తానే తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుంది. అందుకే ప్రత్యేకించి.. ఆయన ఈ జిల్లాలోనే ఓటరుగా నమోదు అయ్యారు. ‘ఏలూరు వాసులు వచ్చి అడిగారు’ అంటూ దానికి ఓ ముసుగు తొడిగారు. ఈ జిల్లాలోనే ఎమ్మెల్యేగా ఆయన పోటీచేయాలని అనుకుంటున్నారు.
భాజపా : భారతీయ జనతా పార్టీని సాంప్రదాయంగా అభిమానించే వారికి దన్నుగా నిలిచే సామాజిక వర్గాల్లో క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలు ఉంటాయి. రాజులు ఈ జిల్లాలో పుష్కలంగానే ఉన్నారు గనుక, ఎన్నికల సమయంలో ఆ సామాజిక వర్గం వారి మాట బీసీల్లో కూడా చెల్లుబాటు అవుతుంది గనుక.. భాజపాకు ఇక్కడ ప్రభ వెలుగుతుందనే అభిప్రాయం ఆ పార్టీ వారిలో ఉంది. ఇంకాస్త ఫోకస్ పెడితే.. ఈ జిల్లాలో తాము బలమైన పార్టీగా ఆవిర్భవించగలమనే ఆశ కూడా వారికి ఉంది.
అందుకే భారతీయ జనతా పార్టీ ఇవాళ అమిత్ షా పాల్గొనే రైతు బహిరంగ సభను తాడేపల్లి గూడెంలో నిర్వహించబోతోంది. అమిత్ షా సభకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఈ బలప్రదర్శన అంతా.. జిల్లాలో తమ బలాన్ని పెంచుకోడానికే అని భాజపా ఆశపడుతోంది. అసలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఏపీలో నెంబర్ టూ స్థానంలోకి రావాలని కలగంటున్న భాజపా.. అందుకు ఈ జిల్లాను ఓ ఆలంబనగా చేసుకోవాలని అనుకుంటోంది.
ఈ రకంగా కూటమిలోని మూడింటిలోనూ ఎవరికి వారు తమ కరిష్మా వల్లనే గత ఎన్నికల్లో ఈ జిల్లాలో నూరు శాతం ఫలితాలు వచ్చాయని అనుకుంటూ, ఈసారి తమ బలాన్నే ఇనుమడింపజేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ‘వెస్ట్’ జనం ఈసారి ఎలాంటి తీర్పును ఇవ్వబోతారో?

