సందేహ భారతం : ఉంటుందా? ఉండదా?

నోట్ల మార్పిడి అనే తంతు స్వానుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇప్పుడు మరొక సందేహం కలుగుతోంది. నోటు ముట్టుకున్న ప్రతిసారీ వారిలో ఇదే అనుమానం తలెత్తుతోంది. ఇంతకూ ఆ సందేహం ఏమిటో తెలుసా? 2000 రూపాయల నోటు శాశ్వతంగా ఉంటుందా? ఉండదా? అనేదే ఆ సందేహం. నల్లధనం కట్టడి చేయాలనీ కంకణం కట్టుకున్న మోదీ, ఇంత పెద్ద డినామినేషన్ నోటు ను చెలామణీ లో పెట్టి, మళ్ళీ అదే తరహాలో నల్ల కుబేరులు నిల్వ చేసుకోవడానికి సహకరిస్తాడా? ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం తొలగిపోయి, జన సామాన్యం అందరి వద్దకు 100, 500 వంటి చిన్న డినామినేషన్ నోట్లు సరిపడా వచ్చేసిన తరువాత ఒకేసారిగా 2000 నోటును రద్దు చేసేస్తారా అనే అనుమానం ప్రబలంగా వినిపిస్తోంది.
జనానికి ఇలాంటి సందేహాలు కలగడానికి చాలా హేతుబద్దత ఉంది. చాలా లాజికల్ కారణాలను చర్చించుకుంటూ 2017 మార్చ్ వరకు ఎకౌంటు లలో లేని సొమ్ము మొత్తాన్ని బ్యాంకు లలో వేసుకోవడానికి అవకాశం ఉన్నది గనుక, అప్పటి దాకా అనుమతించి, ఆ తరువాత కొంచం గడువు ఇచ్చి 2000 నోటును రద్దు చేసేస్తారని అనుకుంటున్నారు. ఈలోగా ఎన్ని వేల 2000 నోట్లు చెలామణీ లోకి వచ్చాయో వాటికీ సరిపడా మొత్తంలో చిన్న నోట్లు ముద్రించి సిద్ధంగా ఉంచి అలంటి చర్య తీసుకుంటారని జనం అనుకుంటున్నారు.
పెద్ద డినామినేషన్ నోట్లే నల్లధనానికి ప్రాణవాయువు. అలాంటప్పుడు 1000 ని రద్దు చేసి, 2000 ప్రవేశపెట్టడం అంటే నల్లధనం నియంత్రణలో పెద్ద కామెడీ అని జనం అనుకుంటున్నారు. మోదీ సర్కారు అంత అనాలోచితంగా ఉండకపోవచ్చునని, జనం వద్ద చెలామణీకి ఇబ్బంది లేకుండా కొత్త నోట్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేసిన తర్వాత.. 2000 నోట్లను కూడా రద్దు చేసేసి, 500 వరకే పెద్ద డినామినేషన్ ను ఆపేస్తారని అనుకుంటున్నారు.
2000 రూపాయల నోటు పలచగా ఉండడం, నాణ్యత విషయంలో రద్దయిన పాతనోట్ల స్థాయిలో లేకపోవడం కూడా.. ఇది ఎక్కువ కాలం మనుగడలో ఉండే నోటు కాదేమో అనే అనుమానం జనానికి కలగడానికి కారణం అవుతోంది.
మరోవైపు కొత్త 1000 రూపాయల నోటు అనేది అంత త్వరగా వచ్చేదేమీ కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆ నేపథ్యంలో.. నల్లధనం దాచుకోవడానికి మరింత సులువుగా ఉండే 2000 నోటును మాత్రం ఎందుకు మనుగడలో ఉంచుతారు? అనేది అందరి సందేహం. మరి కేంద్రం ఈ సందేహాలను నివృత్తి చేస్తుందో? లేదా, డైరక్ట్ యాక్షన్ లోకే దిగుతుందో.. చూడాలి.

