విశ్లేషణ : బ్లాక్ మనీ కట్టడి ఎలా అవుతోంది సార్..?

నరేంద్రమోదీ పెద్దనోట్ల నిషేధం అనేది కేవలం బ్లాక్ మనీని నియంత్రించడం కోసమే చేశారనేది ఒక ప్రచారం కావొచ్చు గాక..! కానీ సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే... బ్లాక్ మనీ కట్టడి కావడం అంత సులువుగా సాధ్యం కాదేమో అనిపిస్తున్నది. దానికి తోడు కొత్త కరెన్సీ నోట్ల విడుదల విషయంలో ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వారు చేస్తున్న ప్రకటనలు కూడా గందరగోళం సృష్టిస్తున్నాయి. వీటిని గమనిస్తే బ్లాక్ మనీ కట్టడి అనేది అసలు కుదరని పనేమో అనిపిస్తోంది. నల్లకుబేరుల వద్ద ఉండే బ్లాక్ మనీ.. పాత నోట్ల నుంచి కొత్త నోట్లకు రూపు మారి.. మళ్లీ నేలమాళిగల్లో నిల్వ అవుతుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎవరో కొందరి వద్ద వందల వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంటే అలాంటి వారు దాన్ని వైట్ మనీ కింద మార్చుకోవడానికి ఎలాంటి మార్గాలు అనుసరిస్తారో సామాన్యులకు బోధపడడం లేదు గానీ.. ఓ మోస్తరు స్థాయిలో బ్లాక్ మనీ ఉన్న వారంతా చాలా సులువుగా మార్చేసుకుంటున్నారు. మీడియా ముఖంగా 30 శాతం కమిషన్ అనేది తేలిపోయిన తర్వాత.. అధికారికంగా 2.5 లక్షల వరకు బ్యాంకు ఖాతాలో వ్యక్తులు డబ్బు వేసుకుంటే దాని గురించి ఆదాయపు పన్ను ఆరాలు కూడా ఉండవు అని తెలిసిన తర్వాత... తమకు వీలైనంత మంది నమ్మకస్తులను వెతుక్కుని వారికి ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాల్లో వేసుకోవాల్సిందిగా చిన్నస్థాయి నల్ల కుబేరులు సూచిస్తున్నారు. వారికి 30 శాతం వరకు కమిషన్ ఆఫర్ చేస్తున్నారు. వారినుంచిచ ముందు జాగ్రత్తగా మిగిలిన మొత్తానికి చెక్ లు తీసుకుంటున్నారు.
అంటే 2.5 లక్షలను నల్లకుబేరుడి నుంచి తీసుకున్న వ్యక్తి.. తన ఖాతాలో వేసుకుని.. ఓ నెల తర్వాత.. తను 30 శాతం డబ్బు మినహాయించుకుని మిగిలిన మొత్తం డ్రాచేసి.. తిరిగి నల్లకుబేరుడికే ఇచ్చేస్తారన్నమాట.
==
ఇక్కడ మరో కీలకాంశం ఏంటంటే.. నల్లకుబేరులు డబ్బు దాచుకోడానికి ఇబ్బంది పడేలా పెద్ద డినామినేషన్ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ వాస్తవంగా జరుగుతోంది ఏమిటి? పైన చెప్పిన పద్ధతిలో తమ డబ్బు 30 శాతం కోల్పోగా తిరిగి తమ వద్దకు నల్లధనంగానే చేరుకుంటోంది. వారు మరింత దండిగా డబ్బును, మరింత సులువుగా దాచుకోవడానికి ప్రభుత్వం 2000 రూపాయల నోట్లను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇవాళ ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. త్వరలోనే 1000 నోట్లు కూడా మళ్లీ రంగ ప్రవేశం చేస్తాయట. ఇక నల్లధనం కట్టడికి జరిగిన ప్రయత్నం అంటూ ఏంటి ఉన్నట్లు? అన్నిరూపాల్లోనూ అదే నోట్లు మళ్లీ కొత్తగా ప్రత్యక్షం అయిన తర్వాత.. ఇక నల్లధనం కట్టడి ఎక్కడ జరుగుతున్నట్టు?
మొన్నటికి మొన్న స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ఉన్నప్పుడు... 45 శాతం పన్ను కింద వసూలు చేసి.. నల్లకుబేరుల డబ్బును ప్రభుత్వం వైట్ గా మార్చి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ విధానాల వల్ల, పైన చెప్పిన పద్ధతిలో 30 శాతం మాత్రం కోల్పోతూ.. నల్లధనాన్ని తిరిగి నల్లధనం గానే కొత్త నోట్లతో నల్ల కుబేరులు దాచుకునే పరిస్థితి ఏర్పడుతోంది..
మరి దీనిని కట్టడి చేయడానికి మోదీ సర్కారు ఎలాంటి కొత్త జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

