వర్సిటీలకు వందల ఎకరాల ధారాదత్తం.. కరెక్టేనా?

చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమరావతి నగరానికి పూర్తిస్థాయి సదుపాయాల కల్పన మీద కూడా దృష్టి పెడుతోంది. ఇక్కడకు ఒక్కటొక్కటిగా సంస్థలను తీసుకురావడం మీద కూడా చూపు సారిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే... చంద్రబాబునాయుడు చాలా ఉదారంగా ప్రెవేటు విశ్వవిద్యాలయాలకు అమరావతి పరిధిలో వందల ఎకరాలను కేటాయించేస్తున్నారు. అయితే ఇలా వందల ఎకరాల భూములను ప్రెవేటు వర్సీటీలకు ధారాదత్తం చేసే పని కరక్టేనా? అనే సందేహాలు పలువురికి కలుగుతున్నాయి. దీనివల్ల ఆశించిన సత్ప్రయోజనాలు ఉంటాయా? లేదా, ఆయా యూనివర్సిటీలకు ఆస్తులు ఏర్పడడం మాత్రమే జరుగుతుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
తమిళనాడులో అంతో ఇంతో పేరున్న ఎస్ఆర్ ఎం యూనివర్సిటీ కి అమరావతిలో వంద ఎకరాలు ఇవ్వడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇదివరకే అంగీకరించింది. దానికి సంబంధించి 50 కోట్ల రూపాయల మొత్తాన్ని వారు ప్రభుత్వానికి చెల్లించడం కూడా జరిగింది. అయితే ఇదే యూనివర్సిటీకి మరో వంద ఎకరాలు కలిపి రెండు వందల ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించేసిందట. ఈ విషయాన్ని సీఆర్డీయే కమిషనరే వారికి స్వయంగా తెలియజేశారు. అంటే తమిళనాడుకు చెందిన ప్రెవేటు వర్సిటీకి రెండు వందల ఎకరాలు దాఖలు చేశారన్నమాట.
అదే చంద్రబాబు సర్కారు.. అమృత యూనివర్సిటీకి కూడా 200 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఈ ఉదాహరణను పరిశీలిస్తే.. ఇదే యూనివర్సిటీ వారు బెంగుళూరు సమీపంలో తమ సొంత డబ్బులతో కొనుక్కున క్యాంపస్ లో యూనివర్సిటీ కేవలం 25 ఎకరాల్లో మాత్రమే ఉంది. అదే యూనివర్సిటీ వారు తమ హెడ్ క్వార్టర్స్ అయిన కేరళలో ఉన్న క్యాంపస్ ఉన్నదంతా కేవలం 80 ఎకరాలు మాత్రమే.
ఇక్కడ అమరావతిలో మాత్రం జనం నుంచి లాక్కున్న భూములను ఏకంగా 200 ఎకరాలు వారికి ప్రభుత్వం ధారాదత్తం చేసేయడాన్ని గమనించాలి. ఈ లెక్కన ఎన్ని ప్రెవేటు వర్సిటీలకు ఎన్ని వేల ఎకరాలను చంద్రబాబు సర్కారు ఇవ్వదలచుకున్నట్లు? ఇదే నగరానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూనివర్సిటీలు, పెద్దపెద్ద విద్యాసంస్థలు వస్తే.. వాటికి ఏ స్థాయి వసతులు కల్పిస్తారు. ఇలాంటి భూముల పందేరంలో ఔచిత్యం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

