రాజకీయ ఆశావహులకు అతిపెద్ద ఎదురుదెబ్బ!

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రి ఎన్నికల తర్వాత.. రాజకీయ పునరేకీకరణలు చాలా పెద్దస్థాయిలో జరిగాయి. పార్టీలు మారడం చాలా పెద్దఎత్తున జరిగింది. అధికార పార్టీ అనేవి ఆకర్షణ కేంద్రాలుగా మారాయి. విపక్షాలనుంచి ఎడా పెడా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేస్థాయి రాజకీయ నాయకులను తమ పార్టీలోకి రాబట్టుకున్నారు. వీరంతా ఇలా ఎగబడి వస్తే.. మరి ఆ పార్టీనే నమ్ముకుని ఎప్పటినుంచో ఉన్న నాయకుల పరిస్థితి ఏమిటి? సందేహాలు లేవనెత్తిన వారందరికీ ఒకటే సమాధానం చెప్పారు. ‘‘నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోంది.. వెయిట్ చేయండి.. అందరికీ పార్టీ అవకాశం కల్పిస్తుంది’’ అని. ఆ మాట నమ్ముకుని చాలా మంది ఉన్నారు.. ఉంటున్నారు.
కానీ అలాంటి రాజకీయ ఆశావహుల కలలన్నీ కుప్పకూలిపోయినట్లే. నియోజకవర్గాల పెంపు అనే వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదని... కేంద్రప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి హన్స్ రాజ్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల పెంపు వ్యవహారం అంత త్వరగా తేలదని స్పష్టం చేసేశారు.
దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ను సవరించాల్సి ఉంటుందని. రాజ్యాంగ సవరణ అనేది ముడిపడి ఉన్నందున ఇప్పట్లో దాని జోలికి వెళ్లలేం అని మంత్రి చెప్పేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆశావహులకు ఇది చాలా పెద్ద అశనిపాతమే అని చెప్పాలి. అలాగే.. ఇన్నాళ్లుగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా రెండేసి పవర్ సెంటర్స్ ఏర్పడుతోంటే.. చూస్తూ ఊరుకున్న పాలక పార్టీలు ఇప్పుడు పరిస్థితిని ఎలా సర్దుబాటు చేసుకుంటాయో చూడాలి.

