పవన్ కల్యాణ్.. ప్రసంగాలు చాలు.. పోరుపంథా ప్రకటించాలి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న బహిరంగ సభల సిరీస్ లో భాగంగా.. ఇవాళ గురువారం అనంతపురంలో సభ నిర్వహిస్తున్నారు. హోదా గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తిరుపతి, కాకినాడల్లో ఇప్పటికే సభలు నిర్వహించిన పవన్ కల్యాణ్ అనంతపురంలో మూడో సభ నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో నిజానికి ప్రత్యేకహోదా సాధించాలంటే పవన్ కల్యాణ్ తీసుకోవాల్సిన చొరవ ఏమిటి? ఇప్పుడు చేస్తున్న కృషిని ఇదే క్రమంలో కొనసాగించడం, మరిన్ని సభలు నిర్వహించడం సరిపోతుందా? లేదా ఆయన తన పంథాను కొద్దిగా మార్చుకుని పోరాటానికి ఉత్తేజం తీసుకురావాల్సిన అవసరం ఉందా అనే చర్చ జనంలో జరుగుతోంది.
పవన్ కల్యాణ్ ప్రత్యేకహోదా విషయంలో చాలా నిబద్ధతతో ఉన్నారు. ఆయన నిబద్ధత విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. నిజానికి ప్రత్యేకహోదా గురించి దాదాపుగా అన్ని విపక్షాలూ మాట్లాడుతూనే ఉన్నాయి. పోట్లాడుతూనే ఉన్నాయి. వామపక్షాలు ధర్నాల ద్వారా, అస్తిత్వం లేని కాంగ్రెస్ సంతకాల సేకరణ ద్వారా, ప్రధాన విపక్షంగా ఉన్న వైకాపా బహిరంగ సభల ద్వారా ప్రత్యేకహోదా గురించి పోరుగళాన్ని వినిపిస్తున్నాయి. అయితే వారందరికీ కూడా హోదా సాధించాలనే కోరికతోపాటూ వారి వారి రాజకీయ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ ఆ విషయంలో ఇంకా స్వచ్ఛంగానే ఉన్నారు. తన సభలు లేదా పోరాట మార్గం ద్వారా ఎలాంటి రాజకీయ వక్ర ప్రయోజనాలను ఆశించే ఉద్దేశమే లేకుండా పవన్ కల్యాణ్ హోదా సభలను నిర్వహిస్తున్నారు. రాజకీయ విమర్శలను పరిమితంగా చేస్తూ.. అచ్చంగా హోదా గురించి మాత్రమే ఆయన మాట్లాడుతుండడం గమనార్హం.
అయితే పవన్ సభలు కూడా హోదా అంటే ఏమిటి? హోదా వలన రాష్ట్రానికి ఏం జరుగుతుంది? ఏంలాభం వస్తుంది? ఎందుకు మనం దానికోసం ఆరాటపడాలి? అనే సత్యాలను ప్రజలకు తెలియజెప్పడం లక్ష్యంగానే సాగుతున్నాయి. ఆయన ప్రసంగాల్లో ఆ అంశాలే ఉంటున్నాయి. అయితే నిజానికి పవన్ కల్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఈ సత్యాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇప్పటికే ఒక అవగాహన ఏర్పడింది. పవన్ తిరుపతిలో కాకినాడలో చెప్పినా కూడా రాష్ట్రమంతా ఆ విషయాలను గమనించారు . తెలుసుకున్నారు. అలాంటి నేపథ్యంలో మళ్లీ సభలు పెట్టి మళ్లీ అవే పాచిపోయిన సంగతులు చెప్పడం దండగ.
పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా సాధించడానికి తన పార్టీ తరఫున ఇంకా నిర్దిష్టంగా పోరాట కార్యాచరణ ఏంటో ప్రకటించే దశ రావాలి. ఇవాళ అనంతపురం సభలోనే అలాంటి ప్రయత్నం జరిగితే నిజంగా పోరాటానికి విలువ వస్తుంది. సభలు ప్రసంగాలు.. ప్రజలకు అవగాహన కలిగించడం, చైతన్యం తేవడం లాంటి పడికట్టు ప్రయత్నాలకు ఇంక ఫుల్స్టాప్ పెట్టాలి. నిజంగా తానేదైనా చేయదలచుకుంటే గనుక.. ఏం చేయబోతున్నాడో.. ఎలాంటి పోరాటంతో హోదా కోసం ఉద్యమించబోతున్నాడో.. ప్రజలు ఏ రకంగా ఆయన వెంట నిలవాల్సిన అవసరం ఉన్నదో పవన్ కల్యాణ్ తెలియజెప్పాలి.
పోరాట పంథా విషయంలో ఒక క్లారిటీకి రాకుండా, కేవలం ప్రసంగాలు చేస్తూ పోయేట్లయితే.. అదేదో ధార్మిక ఆధ్యాత్మిక ప్రసంగ కూటముల్లాగా తయారవుతాయి తప్ప.. ఫలితం సాధించే ఉద్యమం లాగా ఉండబోవు అనే వాస్తవాన్ని పవన్ కల్యాణ్ లేదా ఆయన వ్యూహకర్తలు ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

