తెలంగాణ ముఖ్యమంత్రి త్రిదండి చినజీయర్!!

శ్రీమద్ త్రిదండి రామానుజ చినజీయర్ కొద్దిసేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయారు. ఇదేమీ చమక్కు కాదు. ‘ఒకే ఒక్కడు’ సినిమాలో లాగా అనుకోకుండా తగిలిన ఆఫర్ కాదు! కాకపోతే.. భక్తిపూర్వకంగా ఆయనకు సమర్పించుకున్న నివేదన.
అవును మరి.. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం తన అధికారిక భవన సముదాయంలో చేసిన గృహప్రవేశం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. గృహప్రవేశం సందర్భంగా ప్రధానమైన అన్ని గదుల వద్ద చినజీయర్ స్వయంగా కొబ్బరికాయలు కొట్టి పూజాదికాలు నిర్వహించి.. తొలిసారిగా ప్రవేశించి.. ఆశీ:వచనాలు చేశారు. అలాగే ముఖ్యమంత్రి ఆఫీసులోకి వచ్చిన తర్వాత.. సీఎంకు ఉద్దేశించిన సింహాసనం వంటి అధికారిక కుర్చీలో తొలుత చినజీయర్ ను కూర్చోవాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. దీనికి మొహమాటపడిన చినజీయర్ తొలుత వారించబోయినప్పటికీ, కేసీఆర్ పట్టుబట్టిన తర్వాత.. కాసేపు ఆ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆయనకు ప్రణమిల్లి, ఆయన లేచిన తర్వాత.. కేసీఆర్ అదే కుర్చీలో ఆసీనులయ్యారు. కేసీఆర్ ను త్రిదండి చినజీయర్ ఆశీర్వదించారు.
మొత్తానికి త్రిదండి చినజీయర్ కొద్దిసేపు తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలోకి ప్రవేశించారంటూ హాజరైన అతిధుల్లో కొందరు సరదాగా అనుకోవడం కనిపించింది.

