తెలంగాణలో సెటిలర్లు ఇంకా భయపడుతూనే ఉన్నారా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయింది. తెలంగాణ ఆంధ్రోళ్ల దోపిడీకి గురవుతున్నదంటూ పెద్ద ఎత్తున నడిచిన ఉద్యమానికి సారథ్యం వహించి, ఆంధ్రోళ్ల మీద విద్వేషాగ్నులను వెళ్లగక్కుతూ పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆంధ్రోళ్ల మీద తమకు ద్వేషం ఏమీ ఉండదని, తెలంగాణలో స్థిరపడిన వాళ్లంతా తెలంగాణ బిడ్డలే అని.. అందరినీ తమ బిడ్డల్లాగా చూసుకుంటూనే పాలన సాగిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు ప్రకటించారు. కానీ.. రెండున్నరేళ్లు గడుస్తుండగా.. ఇప్పటికీ ఆయన అదే మాట చెప్పాల్సివస్తుండడమే విచిత్రం. తెలంగాణలో ఉన్న సెటిలర్ల పట్ల ప్రభుత్వం సమదృష్టి ఉంటుందనే భావన ఇన్నాళ్ల పాలన వారికి కలిగించలేకపోయిందా? అందుకే ఇప్పటికీ.. ఆంధ్రోళ్లు తనను పిలిచి సన్మాన సభలు గట్రా పెట్టినప్పుడు.. మిమ్మల్నందరినీ తెలంగాణ బిడ్డల్లాగానే చూసుకుంటా.. అనే పాత నినాదాన్ని ఆయన ఇప్పటికీ వినిపిస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
రెండున్నరేళ్లు పాలన సాగించిన తర్వాత.. కేసీఆర్ సర్కారు తెలంగాణ – సీమాంధ్ర ప్రజల మధ్య ఏదైనా వివక్ష పాటిస్తున్నదా, లేదా ఇక్కడి పౌరులందరినీ ఒకే తీరుగా చూస్తున్నదా అనే విషయంలో ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడి ఉండాలి. కానీ కేసీఆర్ మాటలను బట్టి అలాంటి భరోసా ప్రజల్లో ఇంకా కలగలేదని అనిపిస్తోంది.
తాజాగా కొంపల్లిలో క్షత్రియుల సంఘం వారు ఓ సభ పెట్టుకుని కేసీఆర్ ను ప్రభుత్వంలో ముఖ్యులైన మరికొందరిని ఆహ్వానించారు. ఈ సభలో కేసీఆర్ అలాంటి హామీనే వారికి అందించారు. కేసీఆర్ అంతరంగంలో ఆంధ్రోళ్ల పట్ల తన రాష్ట్రంలో ఇంకా వివక్ష ఉన్నదనే భావన స్థిరపడి ఉన్నట్లుగా దీన్నిబట్టి అనుకోవాల్సి వస్తోంది. ఇక్కడకు వచ్చి సెటిలర్లు తెలంగాణ అభివృద్ధికి చేసిన సేవలను కూడా ఆయన ప్రస్తుతించారు. అయితే ఇప్పటికైనా ఇంకా తనను సన్మానాలకు పిలిచినప్పుడెల్లా.. సెటిలర్లను బిడ్డల్లా చూసుకుంటా అని ప్రసంగాల్లో చెప్పే పరిస్థితి లేకుండా.. ఆ నమ్మకాన్ని వారికి కేసీఆర్ తన చేతల్లోనే కల్పించాలని.. అలా చెప్పుకునే పరిస్థితి లేకుండా ప్రజల్ని సమంగా చూడాలని పలువురు కోరుకుంటున్నారు.

