జగపతిబాబు భుజాల మీదనే మొత్తం భారం పడింది

తన కొడుకును పెద్ద సినీస్టార్ గా చూడాలనుకున్న తర్వాత.. సంపద పుష్కలంగా ఉన్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి.. తమ కన్నడ పరిశ్రమ కంటె, తెలుగు పరిశ్రమ లో కూడా పేరు తెచ్చుకుంటే తప్ప లాభసాటిగా కెరీర్ సాగదనే అభిప్రాయం కలిగినట్లుంది. అందుకే కాబోలు.. తన కొడుకును కన్నడ సినిమాతో పాటు ఏకకాలంలో తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే యువహీరోలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎంతమాత్రమూ ఆ స్లాట్ లో వాక్యూం లేదు.
అయితే, ఇవన్నీ లెక్కలు వేసుకున్నారో లేదో గానీ.. స్ట్రెయిట్ తెలుగు సినిమా రేంజిలో పబ్లిసిటీ గట్రా ప్లాన్ చేసి తెలుగులో సినిమా విడుదల చేశారు. మన తెలుగు ప్రేక్షకులు ఎంత పెద్ద స్టార్ ల సినిమాలనైనా బాగా లేకపోతే తిప్పి కొడతారు. అలాంటిది.. కన్నడ సీఎం కొడుకు అయినంత మాత్రాన సానుభూతితో ఓపెనింగ్ కలెక్షన్లు ఇస్తారనుకోవడం భ్రమే. ఈలోగా సినిమా చీదేసినట్లు రిపోర్టులు వచ్చేశాయి.
అయితే సినిమా టీం మాత్రం టీవీ ఛానళ్లు అన్నీ తిరుగుతూ.. ఇప్పటికీ సక్సెస్ సందర్భంగా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ పొద్దు పుచ్చుతోంది. ఇలాంటి పోస్ట్-రిలీజ్ టీవీ ప్రచార ఇంటర్వ్యూల పోకడ ఎలాంటిదో ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే ఇలాంటి టీవీ డిస్కషన్లలో కూడా ఫ్లాప్ అయిపోయినట్లు తేలిపోయిన సినిమాను పదేపదే పొగుడుకోవడం పాపం ఆ కుర్ర హీరోకు చిరాకు అనిపించినట్లుంది. అందుకే కొన్ని ప్రధాన ఛానెళ్ల డిస్కషన్ లకు మాత్రం తాను హాజరై, తర్వాత బెంగుళూరు వెళ్లిపోయాట్ట. కాకపోతే.. సినిమాలో కీలక పాత్రను చేసిన జగపతి బాబును.. సింగిల్ గా అయినా సరే.. అన్ని టీవీ ఛానెళ్లు తిరిగి ఆయా ఛానెళ్లలో జాగ్వార్ సినిమా సక్సెస్ గురించి చెప్పాల్సిందిగా కోరారుట. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్లుగా.. అందరూ వెళ్లిపోయినా.. అన్ని ఛానళ్లకు వెళ్లి సినిమాను పొగిడే పని జగపతి బాబుకు తప్పలేదు. ఆయన సింగిల్ గానే ఆ పని చేసేస్తున్నాడు. కాకపోతే.. ఇలా టీవీ ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి కూడా రెమ్యునరేషన్ భారీగానే ఉన్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి!

