జగన్ దళం ‘మూకుమ్మడి భేటీ’తో ఫలం ఉంటుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కలసి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం కానున్నారు. రాష్ట్రస్థాయి కీలక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు మాత్రమే కాకుండా.. ఎమ్మెల్యేలుగా గెలిచినందుకు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి పట్టించుకోవడం ప్రాథమిక బాధ్యత గనుక.. సీఎంను కలిసి వాటి గురించి చెప్పుకోవడానికి వారంతా పూనుకుంటున్నారు. సాధారణంగా పాలనలో ఎవరు ఉన్నా సరే.. విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగిస్తాయనేది అందరూ అనుకునే మాట. అందుకే వైకాపా ఎమ్మెల్యేలు సీఎంను కలవాలని అనుకుంటున్నారు.
అయితే జగన్ ముందుగా ఎమ్మెల్యేలు విడివిడిగా సీఎంతో భేటీకి వెళ్లాలని అనుకున్నారు. తర్వాత వారికి కూడా ఎర వేసి తెదేపాలో చేర్చుకుంటారేమో.. ఎవరు ఫిరాయిస్తారో, ఎవరు నికరంగా తమతో ఉంటారో తెలియక.. అందరూ కలిసి మూకుమ్మడిగా వెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే ఇలాంటి మూకుమ్మడి భేటీ వలన అన్ని నియోజకవర్గాల సమస్యల గురించి సీఎంకు చెప్పుకునేంత అవకాశం దొరుకుతుందా? అనేది చాలా కీలకమైన విషయంగా మారింది.
జగన్ బృందంలో ఓ 40 మంది ఎమ్మెల్యేలు వెళ్తారని అనుకున్నా.. ఒక్కొక్కరికి రెండు మూడు నిమిషాల సమయం ఇచ్చినా చాలా సుదీర్ఘమైన భేటీ అవుతుంది. పైగా ఇంత మంది నివేదించే సమస్యలన్నీ సీఎం బుర్రకెక్కడమూ అసాధ్యం. ఏదో వినతిపత్రాలు ఇస్తే తీసుకోవాల్సిందే తప్ప.. భేటీ వలన ఒనగూరే ప్రయోజనం తక్కువ అవుతుంది.
జగన్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారనే భయం ఉండి ఉంటే కనీసం చిన్న బృందాలుగా సీఎం వద్దకు పంపే ప్రయత్నం చేసి ఉండాల్సింది. దానివల్ల అందరి సమస్యలు సీఎం దృష్టికి వెళ్లినట్లు ఉండేది. ఇప్పుడు ఈ మూకుమ్మడి భేటీ వలన.. వినతిపత్రాలు ఇవ్వడానికి వెళ్లినట్లు ఉంటుందే తప్ప, వ్యక్తిగతంగా కలిసి సమస్యలను నివేదించడానిక వెళ్లినట్లు ఉండదని పలువురు అంటున్నారు.

