కేసీఆర్ ప్లాన్ : కొత్త సచివాలయం గ్యారంటీ!

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యావత్తూ సరికొత్త హంగులతో కూడిన అత్యాధునిక వెలగపూడి సెక్రటేరియేట్ లో కొలువు తీరింది. ఇక ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. తెలంగాణ సచివాలయానికి కూడా కొత్త భవనాలు నిర్మించడానికి కేసీఆర్ త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి సెక్రటేరియేట్ ను ఇప్పుడున్న ప్రాంతం నుంచి మరో చోటకు తరలించడానికి కేసీఆర్ చాలా ప్రయత్నించారు గానీ.. ఆ ఆలోచనలన్నీ ఇక పక్కన పెట్టినట్లే తెలుస్తోంది. ఇప్పుడు సెక్రటేరియేట్ ఉన్న ప్రాంగణంలోనే కొత్త భవనాలను నిర్మించి సువిశాలమైన , ఆధునికమైన సెక్రటేరియేట్ గా రూపుదిద్దే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న సచివాలయం చాలా ఇరుకుగా ఉన్నదంటూ దీని మీద కేసీఆర్ చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కూడా.. అసలు ఇది సచివాలయమేనా? విదేశీ ప్రతినిధులు వస్తే మీటింగ్ పట్టుకోవడానికి చిన్న ఏర్పాటైనా అక్కడ ఉన్నదా? అనికూడా ఈ సెక్రటేరియేట్ గురించి అసహనం వ్యక్తం చేశారు. కొత్త సచివాలయం అయితే గ్యారంటీ అని కూడా తేల్చేశారు.
అయితే కేసీఆర్కు కొత్త సచివాలయం మరొక స్థలంలో నిర్మించి.. ప్రస్తుతం ఉన్న జాగాలో ఆకాశహర్మ్యాల నిర్మాణాలను ప్రెవేటు సంస్థలకు అప్పగించాలనే కోరిక ఉండేది. అందుకోసమే ఆయన ఎర్రగడ్డలో సచివాలయం నిర్మాణానికి ప్లాన్ చేశారు. కానీ విమనాశ్రయ అధికారులు అక్కడ ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి నో చెప్పడంతో ఆలోచన మానుకున్నారు. తర్వాత కేసీఆర్ దృష్టి జింఖానా గ్రౌండ్స్ మీద పడింది. రక్షణశాఖకు చెందిన
చెందిన ఆ స్థలాలను రాష్ట్రప్రభుత్వానికి ఇస్తే... నగరానికి దూరంగా బోలెడంత స్థలం ఇస్తానంటూ కేంద్ర రక్షణశాఖకు ప్రతిపాదన పెట్టారు. వారు దానిని ఖాతరు చేయలేదు. కేసీఆర్ పాచిక పారలేదు.
తాజాగా తెలుస్తున్నది ఏంటంటే.. ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంగణంలోనే కొత్త నిర్మాణాలు చేపడతారని తెలుస్తోంది. ఏపీ సచివాలయం మొత్తం వెలగపూడి వెళ్లిపోయిన నేపథ్యంలో వారికి కేటాయించిన భవనాలను ఇక పూర్తిగా తమకు అప్పగించేయాలని కోరే అవకాశం కనిపిస్తోంది. ఆ పర్వం ఒకవైపు నడుస్తుండగానే.. కొత్తగా కొన్ని భవనాలు నిర్మిస్తారని అవి ఆకాశహర్మ్యాలుగానే ఉంటాయని, వీటికి సంబంధించి కేసీఆర్ డిజైన్లు కూడా ఓకే చేశారని త్వరలోనే వాటిని గురించి వివరాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

