‘‘కాపీ అండ్ పేస్ట్’’.. అవే పాచిపోయిన మాటలమూటలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు దసరా పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయదలచుకున్నారు. సాధారణంగా ప్రెస్ మీట్ పెట్టి విలేకరులకు ముచ్చట్లు వెల్లడించడం, ఈ ఏడాదిలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు చెప్పడం అనేది ఆనవాయితీ. అయితే చంద్రబాబునాయుడు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి, అందులో శుభాకాంక్షలు చెప్పేసి అక్కడితో ముక్తాయించారు. అయితే దారుణమైన విషయం ఏంటంటే.. గత ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు ఏమీ ఆ ప్రకటనలో లేవు సరికదా.. కనీసం భవిష్యత్తు మీద ఆశ , పరిపాలన గురించి భరోసా పుట్టించే కొత్త విషయాలు కూడా అందులో ఎంత మాత్రమూ లేవు.
చంద్రబాబునాయుడు తన పత్రికా ప్రకటనలో ప్రధానంగా రెండే అంశాలు ప్రస్తావించారు. రాయలసీమలో కరవుపై యుద్ధం చేసాం అని ఆయన చెప్పుకున్నారు. 4.6 లక్షల ఎకరాల్లో వాటర్ గన్ ల ద్వారా పంటను కాపాడాం అంటూ సీఎం అందులో వివరించారు. అయితే ఈ పంటలు కాపాడడం అనే హైడ్రామా ఇప్పటికీ పెద్ద సస్పెన్స్ సినిమా లాగానే నడుస్తోంది. ఇప్పటికీ కాపాడిన పంటలు అంటూ ఏమీ లేవని, ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువు బారిన రాయలసీమ రైతాంగం కునారిల్లుతోందని పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి.
ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టినప్పటికీ.. ‘‘కనకదుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి , పోలవరం నిర్మాణాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని ’’ మాత్రమే సదరు శుభాకాంక్షల ప్రకటనలో ఓ అభిలాష వ్యక్తమవుతోంది. అమరావతి, పోలవరం..తాజాగా రాయలసీమలో నీటి తుపాకులు .. ఈ మాటలు చంద్రబాబు నోటమ్మట వినీవినీ జనానికి విసుగుపుడుతోంది అంటే అతిశయోక్తి కాదు. అమరావతి విషయంలో గానీ, అటు పోలవరం విషయంలో గానీ.. సమీక్షలు, హడావుడి చేయడాలు, డ్రోన్ కెమెరాలు, లాంటి హంగామా కనిపిస్తోంది తప్ప.. నిర్దిష్టంగా ఇంత భారీ నిధులు వచ్చి.. నిక్కచ్చిగా ఇంత పని జరిగిందనే మాటలు వినిపించడం లేదు.
పోలవరంలో ఎంతో కొంత పని జరుగుతున్నప్పటికీ.. వారాంతానికి అవుతున్న పనిని సగటు లెక్క తీస్తే గనుక.. చంద్రబాబు లక్ష్యిస్తున్నట్లుగా 2018కి కాదు కదా.. మరో పదేళ్లు గడచినా.. ప్రాజెక్టు పూర్తి కాకపోవచ్చు. మరి అసలు అవాంతరాలను చంద్రబాబు మాయచేసి, ఏదో ఒకటి రెండు కాలువలు పూర్తిచేసి, కొన్ని ప్రాంతాలకు కాసిని నీళ్లు పంపించి.. తిమ్మిని బమ్మిని చేసి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అమరావతి నగరానికి ఏ ముహుర్తాన శంకుస్థాపనలు చేశారో గానీ.. ఇప్పటిదాకా ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ ను పట్టుకు వేళ్లాడుతోంటే.. అది కాస్తా కోర్టు బ్రేకులతో ఆగిపోయి ఉంది. ఇలా తన పొ రబాట్లతోనే అన్ని రకాల అవాంతరాలను ఆటంకాలను సృష్టించేసి, అమరావతి నిర్మాణం ఆటంకాలు లేకుండా సాగిపోవాలని దుర్గమ్మ వారిని కోరుకుంటే ఎలా? అని జనం ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ రెండు లక్ష్యాలు ఉన్నాయంటూ ఆయన ఏడాదిపైగా చెబుతూనే ఉన్నారు తప్ప.. పురోగతే కనిపించడం లేదు.
చంద్రబాబు దసరా సందర్భంగా ఇచ్చిన శుభాకాంక్షలు ఎలాంటి శుభసంకేతాలు ఇవ్వడం లేదని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.

