ఈయనకు ముఖ్యమంత్రి పదవి అచ్చిరాలేదా?

ఆయన ఎప్పుడూ మిడిల్ డ్రాపే. పరిస్థితులు చక్కగా ఉన్నా...బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినా...ఆయనకు ముఖ్యమంత్రి పదవి అచ్చిరాలేదు. ఎప్పుడూ త్యాగాలతోనే ఆయన తన సీటును తానే వదులుకున్నారు. ఆయనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జల్లికట్టు ఉద్యమాన్ని ఆయన చక్కగా వినియోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరీ ఆర్డినెన్స్ వచ్చేలా చేయగలిగారు. చెన్నై నగరానికి తాగు నీటి కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తెలుగుగంగ నీటిని తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పన్నీర్ పై ప్రశంసల జల్లు కురిసింది. ప్రతి ఒక్కరూ ఆయన పనితీరును మెచ్చుకున్నారు.
మిడిల్ డ్రాప్ సీఎంగా....
ఇలా ముఖ్యమంత్రిగా పన్నీరు కుదురుకుంటున్న సమయంలో చిన్నమ్మ రూపంలో ఆయనకు పదవీ గండం వచ్చింది. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మిడిల్ డ్రాప్ అవుతూ వస్తున్నారు. 2001 సెప్టంబరు లో సీఎంగా పదవీ బాధ్యతలు చేట్ట 2002 మార్చి వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మళ్లీ 2014లో జయ అక్రమాస్తుల కేసులో ఇరుక్కోవడంతో 2014 సెప్టంబరు నుంచి 2015 మే వరకూ సీఎం పదవిలో ఉండి తిరిగి జయకు బంగారు పళ్లెంలో పెట్టి సీఎం పీఠాన్ని అప్పగించారు. జయకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. 2016 డిసెంబర్ లో జయ మరణం అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టి ఫిబ్రవరిలో తిరిగి సీఎం పదవిని చిన్నమ్మకు అప్పగించారు. మొత్తం మీద ఆయన మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ మధ్యలోనే చిన్నమ్మకు సీఎం పదవిని అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు తమిళనాడు మొత్తం మీద పన్నీరుకు సానుభూతి పెల్లుబుకుతోంది.
- Tags
- పన్నీర్ సెల్వం