ఈయనకు అల్లుడి కంటే జగన్ ముఖ్యమా?

ఆయనకు అల్లుడి కంటే వైసీపీ అధినేత జగన్ ముఖ్యమని తేలిపోయింది. బనగానపల్లి వైసీపీ ఇన్ ఛార్జి కాటసాని రామిరెడ్డి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికే మద్దతుగా నిలిచారు. కాటసాని రామిరెడ్డి నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి స్వయానా మామ. ఆయన టీడీపీకి మద్దతుగా నిలుస్తారని పెద్దయెత్తున్న ప్రచారం జరిగింది. అయితే రామిరెడ్డి మాత్రం తాను పార్టీకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రామిరెడ్డి వైసీపీని వీడతారన్న ఊహాగానాలకు తెరదించేశారు. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి తన సోదరుడికి మద్దతుగా నిలిచేందుకు టీడీపీ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. పార్టీని వీడటమే కాదు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు.
టీడీపీలాగా కాకుండా.......
అధికార తెలుగుదేశం పార్టీ మాదిరిగా కాకుండా పార్టీ మారితే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి రావాలని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇది ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయని వైసీపీ భావిస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా మంత్రి పదవులను కూడా కట్టబెట్టడాన్ని జగన్ విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాదిరిగా వైసీపీ కూడా చేయకూడదన్న లక్ష్యంతో శిల్పా చక్రపాణిరెడ్డి చేత రాజీనామ చేయించారు జగన్. అలాగే కాటసాని రామిరెడ్డి కూడా తనకు బంధుత్వం కంటే పార్టీయే ముఖ్యమని తేల్చి చెప్పడంతో నంద్యాలలో వైసీపీ బలం మరింత పెరిగినట్లయిందన్నది పరిశీలకుల భావన.
