అలా మాట్లాడరాదని వారికి తెలియదు పాపం...!!

వారు అమాయకులు! తమ మాటలు కూడా నేరం కిందికి లెక్కకొస్తాయనే సంగతి వారికి తెలియదు. తమ మాటలు తమను 'క్రిమినల్స్' గా మారుస్తాయని అర్థం చేసుకుని, జాగ్రత్త తీసుకునేంత ప్రాపంచిక జ్ఞానం వారికి లేదు. వారికి తెలిసినదెల్లా కడుపుమంట మాత్రమే. తమకు చేతనైన రూపంలో ఆ డుపుమంటను బయటకు కక్కేయడం మాత్రమే. అవును... నాలుగురోజుల కిందట.. తాగిన మత్తులో ఉన్న దుర్మార్గులు కారుతో ఢీకొట్టి తల్లీ కూతుళ్లను చావు అంచుల్లోకి నెట్టిన ప్రమాదంలో నిందితులందరికీ బెయిల్ లభించడంపై బాధితుల బంధువులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే..
అక్టోబరు 2వ తేదీ అంటే మహాత్ముడు గాంధీ జయంతి. ఆరోజున దేశంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగడానికి వీల్లేదు. ఆరోజు కార్లో పూటుగా మద్యం తాగి, తాగుతూ.. డ్రయివ్ చేస్తూ వెళ్లిన కొందరు వ్యక్తులు.. రోడ్డు పక్కగా ఉన్న తల్లీ కూతుళ్లను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన సంజన బ్రెయిన్ డెడ్ అయింది. నాలుగురోజులు గడచినా.. ఇంకా ఏమీ చెప్పలేం అని డాక్టర్లు అంటున్నారు.
అచ్చంగా తాగుబోతులు ప్రాణాలను బలితీసుకున్న రమ్య దుర్ఘటన లాంటిదే ఇది కూడా. అయితే.. తల్లీ కూతుళ్లను ఢీకొట్టి అప్పటికప్పుడు పరారైపోయిన నిందితులు ఆ తర్వాత తాపీగా అరెస్టు అయ్యారు. ఆలోగా.. తాము చేసిన ఘోరానికి సంబంధించి శిక్ష పడకుండా తప్పించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుని ఉంటారన్నది ఎవరైనా ఊహించవచ్చు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్నట్లుగా ఓ డ్రైవరు కూడా తెరమీదికి వచ్చాడు. మద్యం తాగుతున్న నిందితులు కూడా అరెస్టు అయ్యారు. అయితే వారందరికీ కూడా బెయిల్ లభించింది. సాంకేతికంగా చూసినప్పుడు, ఇది నాన్ బెయిలబుల్ కేసు కాకపోవచ్చు. కానీ మానవత్వపు కోణం ఏమైనట్లు?
ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్న చిన్నారి సంజన బంధువులకు, నిందితులు బెయిల్‌పై క్షేమంగా వెళ్లిపోవడం షాక్ కలిగించింది. కోర్టుల్లో పెద్ద మొత్తాల్లో డబ్బులు లంచాలు తీసుకుని బెయిల్ ఇచ్చేశారంటూ వారు కన్నీళ్లతో బోరుమంటూ ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థ మీద ఆరోపణలు చేయరాదని, అలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తే అది నేరం అవుతుందని బహుశా వారికి తెలియకపోవచ్చు. కానీ ఇలా మద్యం మత్తులో వాహన ప్రమాదాల రూపేణా ఇతరుల ప్రాణాలను బలిగొంటున్న వారిని కట్టడి చేసేందుకు ఇంకా కఠినమైన చట్టాలు రూపొందాల్సి ఉన్నదని.. పలువురు అభిప్రాయపడుతున్నారు.
కనీసం ప్రభుత్వాలు చొరవతీసుకుని అలాంటి చట్టాలు రూపొందించినప్పుడు ఇలాంటి తాగుబోతుల కేసులను నాన్‌బెయిలబుల్ కేసులుగా మారిస్తే.. ఇలాంటి తల్లిదండ్రుల కన్నీళ్లకు విలువ ఉంటుందేమో!

