Fri Jan 30 2026 13:23:33 GMT+0000 (Coordinated Universal Time)
పాపం.. ఆ ఆపరేషన్ చేసి 2000 చేతిలో పెట్టారు
అంబగూడ, పరిసర గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను

అవివాహితుడైన ఒక దివ్యాంగుడికి అతడి అనుమతి లేకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్(వ్యాసెక్టమి) చేసేశారు. ఆ తర్వాత 2000 రూపాయలు అతడి చేతిలో పెట్టి పంపించేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మథిలి బ్లాక్ పరిధిలోని అంబగూడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై జిల్లా ముఖ్య వైద్యాధికారి(సిడిఎంఓ) శుక్రవారం విచారణకు ఆదేశించారు.
ఆగస్టు 3వ తేదీన మథిలి సబ్ డివిజనల్ ఆసుపత్రికి చెందిన ఆశా కార్యకర్తలతో పాటు ఆరోగ్య సిబ్బంది అంబగూడ, పరిసర గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆరోగ్య శిబిరానికి తీసుకెళ్లారు. ఈ ఐదుగురు వ్యక్తులలో మూగ, చెవుడు అయిన 'గంగ దురువా' అనే యువకుడు కూడా ఉన్నాడు. ఆరోగ్య కార్యకర్తలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి తమ టార్గెట్లు పూర్తిచేసుకునేందుకే ఈ పనిచేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే తన కుమారుడిని మథిలి సబ్ డివిజనల్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు ఆరోగ్య సిబ్బంది తనకు చెప్పారని గంగ తల్లి చంప అన్నారు. అయితే ఆపరేషన్ తర్వాత గంగకు రూ. 2,000 నగదు చేతిలో పెట్టి ఇంటికి పంపించారని ఆమె చెప్పారు. గంగ వివాహితుడని, అతని సమ్మతితోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశామని స్థానిక ఆశా కార్యకర్తలు చెబుతున్నారు.ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు తప్పుచేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Next Story

