Fri Jan 02 2026 04:20:30 GMT+0000 (Coordinated Universal Time)
Indore : మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం.. కలుషిత నీరు తాగి 11 మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం జరిగింది. ఇండోర్ లో పదకొండు మంది మరణించారు.

మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం జరిగింది. ఇండోర్ లో పదకొండు మంది మరణించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఈ ఘటన దేశంలో సంచలనం కలిగించింది. దాదాపు వెయ్యికి మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు పదకొండు మంది ప్రాణాలను బలి తీసుకుంది. దేశంలో పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ కు పేరుంది. అలాంటి ఇండోర్ లోనే ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది. మంచినీటి పైపు లైన్ లో మురుగు నీరు కలవడం వల్లనే ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
కలుషిత నీటి వల్లనే...
అయితే ఇండోర్ కార్పొరేషన్ అధికారుల వైఫల్యమేనని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి మంచినీరు దుర్వాసన వస్తుందని, మంచినీటి పైపులైన్ లో డ్రైనేజీ నీరు కలిసిందని మొత్తుకున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. భగీరత్ పుర పైపు లైన్ మార్చడానికి గత ఏడాది ఆగస్టు నెలలోనే టెండర్లు ఖరారయినా పనులు మాత్రం ప్రారంభించకపోవడం వల్లనే ఇంతటి అనర్థం జరిగిందని ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే...
భగీరత్ పుర పైపు లైన్ మార్చడానికి దాదాపు 2.4 కోట్ల రూపాయల అంచనాతో టెండర్ దాఖలైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని, ఈ దుర్ఘటనకు అధికారులే బాధ్యత వహించాలని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. మరొక వైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈఘటనపై సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య పరీక్షల్లోనూ కలుషిత నీరు తాగునీటిలో కలవడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని తేలడంతో ప్రభుత్వం దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
Next Story

