కారణం ఆర్సీబీ యాజమాన్యమే అంటూ తేల్చారు!!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పోలీసుల అనుమతి లేకుండా ఆర్సీబీ యాజమాన్యం ప్రజలను ఆహ్వానించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని ఆరోపించింది. ఆర్సీబీ జూన్ 4 ఉదయం 7:01 గంటలకు సోషల్ మీడియాలో ఉచిత ప్రవేశంతో విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు జరిగే విజయోత్సవ పరేడ్‌లో పాల్గొనాలంటూ ఆహ్వానం పోస్ట్ చేసిందని అందుకే భారీ ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇంతలో స్టేడియం సమీపంలోని ఒక డ్రైన్‌పై ఉంచిన తాత్కాలిక స్లాబ్ జనం బరువుకు తాళలేక కూలిపోవడం కూడా ఈ ఘటనకు కారణమైందని నివేదిక తెలిపింది. ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ నిర్వాహకులైన డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థలు గేట్ నిర్వహణ, అభిమానుల నియంత్రణలో విఫలమైనట్టు నివేదిక పేర్కొంది.

