Fri Dec 05 2025 18:53:27 GMT+0000 (Coordinated Universal Time)
అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి గుర్తుగా నిలిచే అసలైన పండగ ఇది

నేడు రక్షాబంధన్.. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి గుర్తుగా నిలిచే అసలైన పండగ ఇది. తోబుట్టువులకు రక్షణగా నిలిచేందుకు తోడ్పడే అపురూపమైన అనిర్వచీయమైన బంధానికి గుర్తుగా నిలిచే రోజు ఇది. ఒక కడుపున పుట్టి తర్వాత పెళ్లిళ్లయి వేరు వేరుగా ఉంటున్నా ఈరోజు ఒకరినొకరు కలుసుకుని తమ రెండు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. చిన్న నాటి నుంచి ఒకే ఇంట పెరిగి తర్వాత విడిపోయినా కలకాలం అండగా ఉంటానన్న భరోసాను పంచి పెట్టే క్షణాలు ఎంతో మధురానుభూతిని కలిగిస్తాయి.
అరుదైన క్షణాలు పంచి ఇచ్చే...
అన్నకు రాఖీ కట్టే చెల్లెలు.. తమ్ముడికి రక్షాబంధన్ తో మమతను పంచిపెట్టే అక్క ఇలా ఎన్నో అనుబంధాలను గుర్తుచేసుకునే క్షణాలివి. తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు రక్షణకు ప్రతీక గా నిలిచేందుకు ఈ రాఖీపండగ ఎంతో ఉపయోగపడుతుంది. ఏడాదికి ఒక్కసారైనా తమ చిన్ననాటి క్షణాలను గుర్తుకు తెచ్చుకుని ఆప్యాయాతలను, అనురాగాలను పంచుకునేందుకు అవకాశం కల్పించేందుకు రక్షాబంధన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఉత్తర భారత దేశం నుంచి వచ్చిన సాంప్రదాయమైనప్పటికీ ఈ రాఖీపండగ కోసం అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.
రాఖీ కట్టేందుకు మంచి ముహూర్తం?
రాఖీ కట్టిన చెల్లెలు అన్నకు తీపిని తినిపించగా, అన్న తన గారాల చెల్లికి కానుక ఇచ్చుకునే సందర్భం ఇది. కష్టకాలంలో అండగా ఉంటానని సోదరుడి భరోసా కోసం పరితపించే సోదరి ఎదురు చూసే క్షణాలివి. పౌర్ణమి తిధి రోజున ఏటా జరుపుకునే పండగ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే ఈ పండగ కోసం ఏడాదిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఈఏడాది పౌర్ణమి తిథి ఆగస్టు 8వ తేదీన 2.12 గంటలకు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం 1.24 గంటలకు ముగుస్తుందని పండితులుచెబుతున్నారు అయితే రాఖీ కట్టేందుకు మంచి సమయం మాత్రం ఆగస్టు 9వ తేదీ ఉదయం 5.47 గంటల నుంచి మధ్యాహ్నం 1.24 గంటల వరకూ ఉందని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలోనే రాఖీ కడితే మంచిదని, శభమని సూచిస్తున్నారు.
Next Story

