Sat Dec 13 2025 22:34:15 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : పది నిమిషాల ఆలస్యం .. భూమి చౌహాన్ ప్రాణాలు దక్కించుకుంది
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో బతికి బయటపడటం అంటే అది అదృష్టమే. భూమి చౌహాన్ అనే యువతి ప్రాణాలు దక్కించుకుంది

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో బతికి బయటపడటం అంటే అది అదృష్టమే. ఎన్నో కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. 265 మంది వరకూ మరణించారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు తప్ప అందరూ మరణించారు. కాని భూమి మీద నూకలు ఉన్న వారికి మాత్రమే ప్రాణాలు దక్కుతాయి. అటువంటి వారిలో విమానంలో ప్రయాణిస్తున్న రమేష్ విశ్వాస్ కుమార్ ఒకరు కాగా, ఈ విమానంలో ప్రయాణం చేయకుండా మిస్ అయిన వారు కూడా ప్రాణాలు దక్కించుకున్నట్లే. అయితే ఇందులో ఒక యువతికి విమానం మిస్ కావడంతో ప్రాణాలను దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఆమె నెట్టింట వైరల్ గా మారింది. ఆలస్యంగా రావడమే ఆమె ప్రాణాలు దక్కడానికి కారణాలుగా చెప్పాలి.
లండన్ వెళ్లేందుకు...
అహ్మదాబాద్ కు చెందని భూమి చౌహాన్ అనే యువతి లండన్ వెళ్లేందుకు ఈ విమానాన్ని ఎంచుకున్నారు. ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అయితే తన ఇంటి నుంచి బయలుదేరిన సమయం బాగుంది. మధ్యలో అహ్మదాబాద్ లో భూమి చౌహాన్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. విమానాశ్రయానికి రావడానికి చాలా ఆలస్యమయింది. విమానం టేకాఫ్ అయిన పది నిమిషాలకు భూమి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే అలా చేరుకున్న వెంటనే విమానం ప్రమాదానికి గురయిందని తెలిసి షాక్ అయ్యారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండి ఉంటే తాను కూడా ఆ విమానంలో ఉండేదాన్ని అని తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుందని ఆమె తెలిపారు.
అహ్మదాబాద్ ట్రాఫిక్...
ఈ మేరకు తనకు పది నిమిషాల సమయం ప్రాణాలు కాపాడిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన పది నిమిషాల ఆలస్యం తన ప్రాణాలను కాపాడిందని, ఆ గణపతి బప్పే తనను కాపాడంటూ భూమి చౌహాన్ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంటి నుంచి హడావిడిగా ఎయిర్ పోర్టుకు బయలుదేరినా అహ్మదాబాద్ లో ట్రాఫిక్ తనను రక్షించిందని భూమి చౌహాన్ చెప్పుకొచ్చింది. తాను ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో తాను డ్రైవర్ ను కూడా విసుక్కున్నానని, అయితే చివరకు తాను ప్రాణాలతో మిగలడానికి కారణం ట్రాఫిక్ అని భూమి చౌహాన్ చెబుతున్నారు. అంతే.. ఎవరికి ఎంత అదృష్టమో.. అంతే జరుగుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.
Next Story

