Sat Jan 31 2026 05:11:53 GMT+0000 (Coordinated Universal Time)
Maharashtra : నేడు ఎన్సీపీ శాసనసభ పక్ష సమావేశం ...ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్
మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నేడు ముంబైలో సమావేశం నిర్వహించనుంది

మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నేడు ముంబైలో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను శాసనసభ పక్ష నాయకురాలిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ మీడియాకు తెలిపారు. ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో సతీమణి సునేత్ర పవార్ ను నియమించే అవకాశాలున్నాయి.
రాజకీయ వారసురాలిగా...
పార్టీ నిర్ణయం తీసుకుంటే శనివారమే సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం జరిగే అవాకాశాలున్నాయి. అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా ఆయన భార్య సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో పాటు పార్టీ బాధ్యతలను కూడా సునేత్ర పవార్ చూడాలని పార్టీ నేతలు ఎక్కువగా భావిస్తున్నారు. ఈరోజు ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నస్కు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ తెలిపారు. పార్టీ నిర్ణయం తీసుకోవడమే కీలకమని ఆయన చెప్పారు.
నేడు ప్రమాణ స్వీకారం...?
దక్షిణ ముంబైలోని విధానభవన్‌లో ఉన్న ఎన్సీపీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం శాసనసభ పక్ష సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి సునేత్రా పవార్ హాజరుకానున్నారు. ఆమెను కొత్త శాసనసభ పక్ష నాయకురాలిగా ప్రకటించి, అదే రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలు. మహారాష్ట్ర శాసనసభ లేదా మండలిలో ఆమె సభ్యురాలు కాదు. అయితే అజిత్ పవార్ మృతి చెందడంతో పుణె జిల్లా బారామతి అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో అక్కడి నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయి.శాసనసభ పక్ష నాయకుడి పదవి ఖాళీగా ఉండటంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా భర్తీ చేయడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
Next Story

