Fri Jan 30 2026 05:05:38 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Bomb Blast : ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే ఉసురు తీసేలా ఎందుకు మారాడంటే?
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల పోలీసులకు చిక్కుతున్నవారంతా వైద్యులే కావడం విశేషం. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే విధ్వంసం సృష్టించడానికి, అమాయకుల ఉసురు తీయడానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ మహ్మద్ కూడా డాక్టర్. అతను పుల్వామాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఉమర్ మహ్మద్ 1989లో జన్మించాడు. గట్టిగా ముప్ఫయి ఆరేళ్లు.
తండ్రి ఉపాధ్యాయుడిగా...
ఉమర్ మహ్మద్ తండ్రి నబీ భట్. తల్లి షమీమా బానో. నబీ బట్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదేళ్ల క్రితం ఉద్యోగం మానేశారు. ఉమర్ మహ్మద్ మాత్రం ఎంబీబీఎస్, ఎండీ చేశాడు. శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఎండీగా కూడా పూర్తి చేశాడు.జీఎంసీ అనంతనాగ్ లో సీనియర్ రెసిడెంట్ గా ఉన్న ఉమర్ మహ్మద్ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఉమర్ మహ్మద్ తీవ్రవాద భావాజాలానికి ఆకర్షితుడయ్యాడు.
దొరికపోతానని భయపడి...
అనేక మంది డాక్టర్లను జమ్మూ కాశ్మీర్ పోలీసులు పట్టుకోవడంతో తాను కూడా దొరికపోతానని ఉమర్ మహ్మద్ భయపడ్డాడు. అందుకే చనిపోయే ముందు పేలుళ్లకు పాల్పడాలని భావించి ఈ స్కెచ్ వేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఈ పేలుళ్లు జరపడానికి ముందు తల్లితో మాట్లాడినట్లు గుర్తించారు. తాను లైబ్రరీలో చదువుకుంటున్నానని ఫోన్లు చేయవద్దని కోరాడు. పోలీసులు ఉమర్ మహ్మద్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పేలుడులో మరణించింది ఉమర్ మహ్మద్ కాదా? అన్నది తెలుసుకోవడానికి వారి నుంచి డీఎన్ఏ టెస్ట్ కోసం రక్తనమూనాలను సేకరించారు.
Next Story

