Sat Dec 13 2025 22:35:13 GMT+0000 (Coordinated Universal Time)
Mumbai : ముంబయి మారణహోమానికి పదిహేడేళ్లు
ముంబయిలో జరిగిన మారణహోమానికి నేటితో పదిహేడేళ్లు పూర్తయింది.

ముంబయిలో జరిగిన మారణహోమానికి నేటితో పదిహేడేళ్లు పూర్తయింది. 2008వ సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన ముంబైలో ముష్కరులు తెగబడ్డారు. బరితెగించిన ఉగ్రమూక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దాడులకు దిగారు. తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ దాడుల్లో ఎన్నో కుటుంబాలలో విషాదం నెలకొంది. అనేక మంది అమాయకులు ముష్కరుల చేతిలో అశువుల బాశారు. పదిహేడేళ్లవుతున్నా ముంబయి పేలుళ్ల గాయం నుంచి ఇంకా అనేక కుటుంబాలు కోలుకోలేదు.
నవంబరు 26 2008న...
2008 నవంబర్ 26వ తేదీన జరిగిన ఉగ్రదాడితో భారతదేశం వణికిపోయింది. ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రదాడి ని తీవ్రంగా ఖండించాయి. రాత్రి 9. 30 గంటలకు ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ లో చొరబడి ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.చత్రపతి శివాజీ టెర్మినస్ తో పాటు 12 చోట్ల ముష్కరుల దాడికి దిగారు. ఈ దాడుల్లో అనేక మంది అమాయకులు మరణించారు. ఏకే 47 తుపాకులని ఎక్కుపెట్టి జరిపిన కాల్పుల్లో 58 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కసబ్ ను ఉరి తీసినా...
ఊహించని దాడికి ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. అక్కడి నుండి వీధుల్లోకి వెళ్లి న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. నారీమన్ లైట్ హౌస్ ,ఒబెరాయ్ ట్రైడెంట్, కామా హాస్పిటల్ ,తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల దాడులతో ముంబై నగరం భీతిల్లి పోయింది. దాదాపు అరవై గంటల పాటు సాగిన మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా వేలసంఖ్యలో అమాయక ప్రజలు క్షతగాత్రులయ్యారు.మరణించిన వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. లష్కరే తోయిబా కు చెందిన పది మందిలో తొమ్మిది మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఇక ఈ ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకున్నారు.ఈ కేసులో కసబ్ కు ఉరి శిక్ష విధించడంతో అతన్ని ఉరి తీశారు. కానీ నేటికీ ముంబయి మారణహోమం విషాదం వందలాది కుటుంబాలను వెంటాడుతూనే ఉంది.
Next Story

