Fri Dec 05 2025 08:45:58 GMT+0000 (Coordinated Universal Time)
Vice President : ఉప రాష్ట్రపతి ఎంపికలో ఇవే కీలకంగా మారనున్నాయా? మోదీ మదిలో ఎవరున్నారు?
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరన్న దానిపై చర్చ జరుగుతుంది

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే మోదీ, అమిత్ షాల మదిలో ఎవరి పేర్లున్నాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ చివరకు ఫైనల్ గా రానున్న ఎన్నికల్లో ప్రయోజనం చేకూరే విధంగానే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని నెల రోజుల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
నితీష్ అంగీకరిస్తారా?
బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు వినిపిస్తున్నా ఆయన ఈ పదవికి అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. నితీష్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేందుకు మొగ్గు చూపుతారు. అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నితీష్ కుమార్ ను ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చే్స్తే వచ్చే ఎన్నికల్లో బీహార్ లో విజయం సాధించి బీజేపీ నేత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టవచ్చన్న అంచనాలు ఉన్నాయి. నితీష్ కుమార్ పేరు పెద్దగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించే అవకాశాలున్నాయన్నది ఆయనను దగ్గర నుంచి చూసిన వ్యక్తులు విశ్లేషిస్తున్నారు.
శశిధరూర్ అంటున్నప్పటికీ...
కానీ నితీష్ తన కుమారుడు నిషాంత్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, తనకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక కాంగ్రెస్ ఎంపీ శశి ధరూర్ పేరు వినిపిస్తున్నా ఆయన పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండక పోవచ్చని అంటున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కాంగ్రెస్ నేత అయినా ఈ మధ్య కాలంలో బీజేపీకి అనుకూలంగా మారడంతో ఆయనను ఎంపిక చేస్తారంటున్నారు. అయితే శశిధరూర్ కేరళకు చెందిన నేత కావడంతో ఆయనకు ఉప రాష్ట్రపతి దక్కే అవకాశం లేదు. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చినందున రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్...
ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేరు కూడా వినిపిస్తుంది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేరు కూడా ప్రచారంలో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుండటంతో ఆయనకు కూడా పదవి ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇవేమీ కాకుండా ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు కూడా వినిపిస్తుంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న ఆయనను ఉప రాష్ట్రపతిని చేస్తే ఇటు జేడీయూకు పదవి ఇచ్చినట్లవుతుంది. అలాగే బీహార్ ఎన్నికల్లోనూ ప్రయోజనం చేకూరే అవకాశముందని భావిస్తున్నారు. మొత్తం మీద ఉప రాష్ట్రపతి ఎంపిక విషయంలో మోదీ, షాలదే ఫైనల్ నిర్ణయం కావడంతో కొత్త వ్యక్తి పేరు కూడా వచ్చే అవకాశం లేకపోలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story

