Sat Dec 13 2025 22:34:14 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Bomb Blast : ఢిల్లీ పేలుళ్లపై షాకింగ్ నిజాలివే.. దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు ఉగ్రకుట్ర కారణమని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు.

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు ఉగ్రకుట్ర కారణమని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. కారు పేలుడును పోలీసులు ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. ‘వైట్‌కాలర్’ టెర్రర్ నెట్‌వర్క్‌పై కేంద్ర సంస్థలు దాడులు ప్రారంభించడంతో భయపడ్డ నిందితుడు కారులో తనను తాను పేల్చుకున్నాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫరీదాబాద్‌లో వరసగా జరిగిన దాడుల తర్వాత నిందితుడు భయపడి త్వరగా అక్కడి నుంచి బయటపడి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. మరొక వైపు అనుకోకుండా కారు పేలిన అవకాశం ఉండి ఉండవచ్చని కూడా అనుకుంటున్నారు. పేలిన కారు నడిపింది దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ మహ్మద్ ఉమర్ నబీ.
45 కిలోమీటర్లు.. 11 గంటల ప్రయాణం...
మహ్మద్ ఉమర్ నబీ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ అంతర్రాష్ట్ర టెరర్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నవాడిగా అనుమానిస్తున్నారు. అతడు రెండు నెలల క్రితం చివరిసారి కశ్మీర్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మొదట కారు లో ముగ్గురు ఉన్నారని సమాచారం వచ్చినా, తర్వాత నబీ ఒక్కడే ఉన్నట్లు తేలిందని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా, నబీ ఎర్రకోట సమీపంలోని సునెహ్రీ మసీదు పార్కింగ్‌లో మూడు గంటలపాటు ఆగి తన సహచరుల అరెస్టులపై ఇంటర్నెట్లో సమాచారాన్ని వెతికినట్లు తెలిసింది. సోమవారం ఉదయం ఫరీదాబాద్ నుంచి బయలుదేరిన కారు సాయంత్రం 6.52 గంటల సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర పేలిపోయింది. దాదాపు 45 కిలోమీటర్ల ప్రయాణానికి 11 గంటలు పట్టినట్లు గుర్తించారు.
ఉగ్రవాద సంస్థల తో సంబంధాలు...
దర్యాప్తు అధికారులు 2,900 కేజీల పేలుడు పదార్థాలు, ముఖ్యంగా అమోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని “వైట్‌కాలర్ టెర్రర్ నెట్వర్క్”లో భాగమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పేలుడు అనంతరం ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫరీదాబాద్‌లో అరస్టయిన ముగ్గురు డాక్టర్లు షాహీన్ సయీద్, ముజమ్మిల్ గనాయి, ఆదిల్ అహ్మద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందినవారేనని అధికారులు వెల్లడించారు. వీరిని జైష్-ఎ-మొహమ్మద్, అంసర్ ఘజ్వత్ ఉల్ హింద్ సంస్థలతో సంబంధం ఉన్న “వైట్‌కాలర్” మాడ్యూల్లో భాగంగా గుర్తించారు. ఈ కేసులో మరో ఎనిమిది మందిని అరెస్టు చేసి, నలుగురిని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీలో కొనసాగుతున్న హై అలెర్ట్...
షాహీన్ సయీద్ జైష్‌కు చెందిన మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మొమినాత్’ను భారత్‌లో నిర్వహించినట్లు, ముజమ్మిల్ గనాయిపై జమ్మూకశ్మీర్ పోలీసులు మరో కేసులో వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. పుల్వామాకు చెందిన మరో వ్యక్తి తారిక్ నబీకి కారు ఇచ్చినట్లు తేలడంతో అతనిని కూడా అరెస్టు చేశారు.ప్రస్తుతం ఢిల్లీలో హైఅలెర్ట్ కొనసాగుతుంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు జరుగుతున్నాయి. ఎర్రకోట పరిసరాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఉత్తర భారత రాష్ట్రాల వ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయని, ఈ “వైట్‌కాలర్ టెర్రర్ నెట్వర్క్” వెనుకున్న పూర్తి మాడ్యూల్‌ను బహిర్గతం చేయడంపై దృష్టి పెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Next Story

