Sun Dec 08 2024 21:53:28 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : బెనారస్ చీరలకు డిమాండ్.. అయోధ్య రామమందిరం నిర్మాణంతో?
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామమందిరం ప్రారంభం కానుంది. బెనారస్ చీరలకు భారీగా డిమాండ్ పెరిగింది
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామమందిరం ప్రారంభం కానుంది. రామ్ లల్లాను ప్రతిష్టించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ అమృత ఘడియల కోసం వేచి చూస్తుంది. దేశ వ్యాప్తంగా 22న రాములోరి పండగను చేసుకునేందుకు జనం సిద్ధమయ్యారు. ప్రత్యేక పూజలతో పాటు భజనలు చేస్తూ రాముల వారిని ప్రార్ధించనున్నారు. అయోధ్యకు లక్షలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. భారత్ లోనే కాదు విదేశాల్లోని భారతీయులు కూడా అయోధ్యలోని రామమందిర నిర్మాణం పట్ల ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఏ ఏ వసతులున్నాయి? అక్కడ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు వంటి వాటిని నెట్టింగ్ ఎక్కువ మంది శోధిస్తున్నారు.
పూజల సమయంలో...
ఇదిలా ఉండగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం సందర్భంగా జరుగుతున్న పూజల సమయంలో ధరించేందుకు వారణాసిలో ప్రత్యేకంగా చీరలు తయారవుతున్నాయి. బెనారస్ చీరలకు ప్రత్యేకత ఉంది. దేశ, విదేశాల నుంచి బెనారస్ శారీలకు పెద్దయెత్తున ఆర్డర్ లు ఇస్తున్నారు. రామమందిరం విశిష్టతను తెలుపుతూ చీరలను తయారు చేస్తుండటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రామమందిరం థీమ్ తో తయారవుతున్న చీరలను ఎక్కవ మంది కోరుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ చీరలు ధరించి ఈ నెల 22వ తేదీన పూజలో పాల్గొనేందుకు ఎక్కువ మంది మహిళలు ఉత్సాహం చూపుతున్నారు.
అయోధ్య విశేషాలతో...
రాముడు జన్మించిన అయోధ్యకు సంబంధించిన విశేషాలను తెలియజెప్పే చిత్రాలతో ఉన్న చీరలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఒక్కో చీర ఖరీదు ఏడు వేల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. లక్ష వరకూ ధర పలికే చీరలు తాము నేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరల విషయంలో ఎవరూ రాజీపడటం లేదని, తమకు నచ్చిన చీరను కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా చాలా రోజుల తర్వాత అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. ఈ చీరల తయారీలో వ్యాపారులు తలమునకలై పోయారు. ఎక్కువగా ఆర్డర్లు వస్తుండటంతో వారికి సకాలంలో ఇచ్చేందుకు 24 గంటలూ పనిచేస్తున్నామని చెబుతున్నారు.
Next Story