Fri Dec 05 2025 21:08:25 GMT+0000 (Coordinated Universal Time)
రానున్న నాలుగు రోజుల్లో ఆరు రాష్ట్రాలకు వర్షసూచన
రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలలో ఈదురుగాలులు, ఉరుములు..

ఠారెత్తిస్తోన్న ఎండల నుంచి కొన్ని రాష్ట్రాలకు ఉపశమనం లభించనుంది. తాపాన్ని పెంచే ఎండలు, వడగాల్పుల నుండి ఉపశమనాన్నిస్తూ.. వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. రానున్న వారంరోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు తెలిపింది. తూర్పు-మధ్య భారతం, ఈశాన్య భారతం, దక్షిణాదిలోని ప్రాంతాల్లో వడగాల్పులు తగ్గుతాయని పేర్కొంది.
రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కోస్తా ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరిలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. కోస్తా ఆంధ్ర, తెలంగాణలలో అక్కడక్కడ వడగళ్లు పడవచ్చని తెలిపారు.
దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయగోదావరి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున.. ప్రజలు, రైతులు చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించారు.
Next Story

