Fri Dec 05 2025 12:29:31 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : రెండేళ్ల తర్వాత మోదీ పర్యటన.. మణిపూర్ లో అభివృద్ధి పనుల ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మణిపూర్ లో పర్యటించనున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మణిపూర్ లో ఆయన పర్యటన సాగనుంది

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మణిపూర్ లో పర్యటించనున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మణిపూర్ లో ఆయన పర్యటన సాగనుంది. మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న తర్వాత మోదీ తొలిసారి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు ఈ పర్యటన అని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ ఈ పర్యటనలో దాదాపు 8,500 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
గత రెండేళ్లుగా...
మణిపూర్ గత రెండేళ్లుగా హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతుంది. జాతుల మధ్య హింసను అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అనేక మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ పర్యటన రాజకీయంగానే కాదు...జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ప్రధాని నరంద్ర మోదీ పర్యటన సందర్భంగా మణిపూర్ లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పటిష్టమైన భద్రతాచర్యలను చేపట్టింది. ప్రధాని మోదీ మిజోరం నుంచి చురాచంద్ పుర్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చురాచంద్ పుర్ లో 7,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
జాతికి అంకితం చేసి...
అనంతరం ఇంఫాల్ లో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులను నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మోదీ వరసగా ఈ నెల 13, 15, తేదీల మధ్య మిజోరాం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ లో పర్యటించనున్నారు. మిజోరాం రాజధాని అయిజోట్ లో 8,071 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైలు కారిడార్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. ఈ కారిడార్ 51.38 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ కారిడార్ లో మొత్తంం 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించారు. ఈ కారిడార్ వల్ల అయిజోల్ సమీపంలోని సాయిరంగ్ స్టేషన్ నుంచి ఢిల్లీ, కోల్ కత్తా, గౌహతికి వెళ్లేందుకు నేరుగా రైళ్లు నడవనున్నాయి. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ ఎత్తున భద్రతాదళాలు పహారా కాస్తున్నాయి.
Next Story

