Mon Oct 14 2024 06:36:21 GMT+0000 (Coordinated Universal Time)
Prashanth Kishore : ఎన్నికల వ్యూహకర్తగా నిలిచారు.. మరి అసలైన ఎన్నికల్లో సక్సెస్ అవుతారా?
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరు పరిచయం అక్కరలేని పేరు. అన్ని రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగిపోతుంది
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరు పరిచయం అక్కరలేని పేరు. అన్ని రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమోగిపోతుంది. దేశ వ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్త ఎవరంటే తొలుత వినిపించేది ప్రశాంత్ కిషోర్ పేరే. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకూ ఎందరినో ముఖ్యమంత్రి పదవిని గద్దెనెక్కించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. తన టీంతో ప్రత్యేక స్ట్రాటజీలతో ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ పార్టీలు కోట్లు పోసి కొనుగోలు చేస్తాయి. పదుల కోట్ల రూపాయలు ఇచ్చి మరీ తమ పార్టీ స్ట్రాటజిస్టుగా నియమించుకుని మరీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన వారెందరూ ఉన్నారు. ఆయన వ్యూహాలు తిరుగులేనివని అంటారు.
అనేక రాష్ట్రాల్లో...
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయగలిగారు. పొరుగున ఉనన తమిళనాడులో డీఎంకేకు కూడా ఎన్నికల వ్యూహకర్తగా ఉండి అక్కడ ఆ పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఇక ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల వ్యూహకర్తగా మారి మూడోసారి అందలం ఎక్కించారు. ఇక పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి కూడా వ్యూహకర్తగా ఉండి ఆమెకు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెట్టారు. మహారాష్ట్రలో శివసేనకు అండగా నిలిచారు. ఇలా ఉత్తరాది లేదు.. దక్షిణాది లేదు...దేశ వ్యాప్తంగా ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా సక్సెస్ అయ్యారు.
బీహార్ ఎన్నికల్లో...
అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఆయన ఫోకస్ సీఎం ఛెయిర్ మీద పడింది. అందరినీ ముఖ్యమంత్రిని చేసిన తాను తానెందుకు సీఎం కాకూడదనుకున్నారో ఏమో? ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పార్టీని ఈరోజు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. సుదీర్ఘ పాదయాత్రను కూడా బీహార్ లో చేశారు. దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే గంటలో సంపూర్ణ మద్యనిషేధం అమల్లోకి తెస్తామని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. గత రెండేళ్ల నుంచి ఆయన బీహార్ కే పరిమితమై గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
అంత సులువు కాదంటున్న...
ముస్లిం వర్గాలను, మహిళలను ఆకట్టుకునే విధంగా ప్రశాంత్ కిషోర్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా తాను సంపాదించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి పదవి కోసం ప్రశాంత్ కిషోర్ వెచ్చిస్తున్నట్లు తెలిసింది. ఇటు ఆర్జేడీ, అటు నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు పైకి బాగానే ఉన్నప్పటికీ బీహార్ పరిస్థితులు ఎంత మేరకు అనుకూలిస్తాయా? అన్న సందేహం కలుగుతుంది. ఎందుకంటే బీహార్ లో కుల రాజకీయాలు ఎక్కువ. అక్కడ అక్షరాస్యత కూడా తక్కువ. అలాంటి చోట ప్రశాంత్ కిషోర్ ఎలా నెగ్గుకు రాగలడన్నదే అసలైన ప్రశ్న. ఎందరినో ముఖ్యమంత్రులను చేసినా బీహార్ లో మాత్రం ఆ పప్పులుడకవు అంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story