Fri Feb 14 2025 01:37:48 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో ముగిసిన పోలింగ్.. ఈ పోలింగ్.. ఎవరికి లాభం?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గింది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది.

ఢిల్లీలో పోలింగ్ శాతం తగ్గింది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రం ఓటు వేసేందుకు అనుమతిస్తారు. సాయంత్రం ఐదు గంటల వరకూ 57.70 శాతం పోలింగ్ మాత్రమే నమోదయింది. 13,330 పోలింగ్ కేంద్రాలను 1.55 కోట్ల మంది ఓటర్ల కోసం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేశాయి. ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ మధ్యనే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనాగావినిపిస్తుంది. అయితే అరవై శాతం పోలయితే ఎక్కువ అయినట్లేనని అది తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తుండగా, మరోసారి అధికారం తమదేనని ఆమ్ ఆద్మీపార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
ఉచిత హామీలతో ప్రజల ముందుకు...
ఈసారి అన్ని రాజకీయ పార్టీలూ ఉచిత హామీలతో ప్రజల ముందుకు వెళ్లాయి. ఆమ్ ఆద్మీపార్టీపై అవినీతి ముద్ర పడింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయితే ఇది కక్ష సాధింపు చర్య అని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్నప్పటికీ ప్రజలు ఏ మేరకు విశ్వసించారన్నది ఈ నెల 8వ తేదీన కౌంటింగ్ రోజున తెలియనుంది. అరవింద్ కేజ్రీవాల్ ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆయన విమర్శల ధాటిని ప్రచారంలో పెంచారు. యమునా నదిలో పొరుగు రాష్ట్రమైన హర్యానా విషం కలుపుతుందన్న వ్యాఖ్యలు సంచలనమే అయ్యాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.
ద్విముఖ పోటీ అయినా...?
యమున నది నీరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దశాబ్దకాలం పాటు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి సాధించారని ఆమ్ ఆద్మీపార్టీపై బీజేపీ విరుచుకుపడింది. వాయుకాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను కూడా ఈ పర్భుత్వం తీర్చలేకపోతుందని బీజేపీ అగ్రనేతలు విమర్శలకు దిగారు. బీజేపీ కూడా ఈసారి ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఉచిత హామీలను ప్రకటించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమ మ్యానిఫేస్టోను విడుదల చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఓట్లు చీలిస్తే అది ఎవరికి లాభదాయకమన్నది తేలకుండా ఉంది. అధికారంలోకి రాగలే శక్తి కాంగ్రెస్ లేకపోయినా రెండు పార్టీలో ఒకదానిని ఓడించే స్థాయిలో ఓట్లను రాబట్టుకోగలదని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉండటంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ వైపునకు మొగ్గు చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరోసారి ఆమ్ ఆద్మీపార్టీకి అవకాశం ఇస్తారా? లేక డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీకి జై కొడతారా? అన్నది ఈ నెల 8వ తేదీన తేలనుంది.
Next Story