పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి హతం
జమ్మూ కశ్మీర్లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గాం ఉగ్ర దాడికి కుట్ర పన్నిన తీవ్రవాది ఉన్నాడు.

జమ్మూ కశ్మీర్లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గాం ఉగ్ర దాడికి కుట్ర పన్నిన తీవ్రవాది ఉన్నాడు. శ్రీనగర్ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారాకమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్లో పహల్గాం ఉగ్ర దాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్తోపాటు అతడి ఇద్దరు అనుచరులు హతమయ్యారు. భద్రతా దళాలు అంతమొందించిన ఉగ్రవాదుల్లో గత ఏడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ ఉన్నాడు. మరో ఉగ్రవాదిని హమ్జా అఫ్గానీగా గుర్తించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడంతో భద్రతా దళాలు వారి ఉనికిని పసిగట్టాయి. పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి సులేమాన్ ను హషీం మూసా అని పిలుస్తారు. అతడు గతంలో పాకిస్థాన్ సైన్యంలో పని చేశాడు. ఆ తరువాత లష్కరే తయ్యిబాలో భాగమయ్యాడు. పహల్గాం దాడి తర్వాత గండేర్బల్లో సులేమాన్ షా తలదాచుకున్నాడు. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత అతడి ఆచూకీ తెలిపిన వారికి 20లక్షల రివార్డును జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రకటించారు.

