Sun Jun 22 2025 12:11:33 GMT+0000 (Coordinated Universal Time)
Corona Virus : భారత్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. మరణాల సంఖ్య కూడా?
భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఏడువేలకు చేరువకు కరోనా వైరస్ కేసులు చేరుకోవడం ఆందోళన కల్గిస్తుంది

భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఏడువేలకు చేరువకు కరోనా వైరస్ కేసులు చేరుకోవడం ఆందోళన కల్గిస్తుంది. మే 25వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఏడు వేలకు సమీపానికి చేరుకుంది. దేశంలో నమోదయిన కేసుల్లో కొత్త వేరియంట్ కనిపించిందని కేంద్ర వైద్య ఆరోగ్య వైద్య శాఖ అధికారులు తెలిపారు. భారత్ లోని 163 కేసుల్లో కొత్త వేరియంట్ ఎక్స్ ఎఫ్.జి కనిపించిందని చెప్పారు. ఈ వేరియంట్ తొలుత కెనడాలో వెలుగు చూసిందని, ఈ కొత్త వేరియంట్ మహారాష్ట్రలో అత్యధికంగా 89, తమిళనాడులో 16, కేరళలో 15, గుజరాత్ లో ఒకటి, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో తలో ఆరు కేసులు నమోదయ్యాయి.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం భారత్ లో 6,815 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుంచి 7,644 మంది కోలుకున్నారని కూడా తెలిపింది. కోలుకునే వారి సంఖ్య కూడా బాగా ఉండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు కోవిడ్ కారణంగా మరణించారు. కేరళ, జార్ఖండ్, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో భారత్ లో కరోనా మృతుల సంఖ్య 68కి చేరుకుంది. అత్యధికంగా కేరళలో 2,053 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో 1,109, పశ్చిమ బెంగాల్ లో 747, ఢిల్లీలో 691, కర్ణాటకలో 559 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
అలెర్ట్ గా ఉండాల్సిందేనంటూ...
అయితే ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా కోవిడ్ వార్డులను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకంగా ఐసొలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చుకోవాలని, దీంతోపాటు కోవిడ్ కు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు అలెర్ట్ జారీ చేసింది. ఈ కోవిడ్ వేరియంట్ పెద్దగా ప్రమాదకరం కాకపోయినా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, అందుకే ప్రజలలో అవగాహన కల్పించేలా కార్యక్రమాలను చేపట్టాలని కోరింది. మాస్క్ లను ధరించేలా చర్యలు తీసుకోవాలని, కేసుల పెరుగుదల అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.
Next Story