Wed Jan 21 2026 10:55:45 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ నాణెం విడుదల
దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రూ.100 విలువైన ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. భారత చలనచిత్ర రంగం పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. దేవుళ్ల రూపాలను ప్రజలు ఎన్టీఆర్ లో చూసుకున్నారని.. రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన తపించారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారన్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దానిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, అశ్విని దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.
Next Story

