Fri Dec 05 2025 08:15:01 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : పాక్ కు సహకరించిన వారిపై కనికరం చూపొద్దు.. బాయ్ కాట్ చేయాల్సిందేనంటూ?
టర్కీని బహిష్కరించినట్లుగానే... చైనా వస్తువులను కూడా బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున నెటిజన్లు నినదిస్తున్నారు

టర్కీని బహిష్కరించినట్లుగానే... చైనా వస్తువులను కూడా బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున నెటిజన్లు నినదిస్తున్నారు. మొన్నటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రవాదులకు ఊతమిచ్చిన పాకిస్తాన్ కు టర్కీ, చైనాలు అండగా నిలిచాయన్నది బహిరంగ రహస్యం. టర్కీ డ్రోన్లు, క్షిపణులు సరఫరా చేస్తే చైనా కూడా పాక్ కు సాయం చేయడంలో ముందుంది. ఈ విషయంలో భారత్ బయటపడకపోయినా చైనా మద్దతు పాక్ కు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరికీ అర్థమయింది. ఇప్పటికే టర్కీ పై ప్రభుత్వ నిర్ణయాలతో నిమిత్తం లేకుండా వ్యాపారులు వస్తువులను బహిష్కరించారు. దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల మేరకు ఒక్క యాపిల్స్ దిగుమతిని రద్దు చేసుకోవడం వల్లనే టర్కీకి నష్టం వాటిల్లింది.
పర్యటనలను రద్దు చేసుకుని...
ఇకతాజాగా టర్కీ పర్యటనలను కూడా అనేక మంది రద్దు చేసుకుంటున్నారు. రద్దు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. టర్కీతో పాటు అజర్ బైజాన్ లకు కూడా చాలా మంది వెళ్లేందుకు నిరాకరిస్తూ తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. కొత్త బుకింగ్ లు అరవై శాతం పడిపోయాయని, రద్దు చేసుకునే వారిశాతం కూడా 250 శాతానికి చేరినట్లు ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. భారత్ కు సంఘీభావంగా ఆ దేశాలకు వెళ్లకూడదని, తద్వారా ఆ దేశాలకు టూరిజం పై భారీగా ప్రభావం చూపుతుంది. ఇరవై రెండు శాతం మంది టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. భూకంప సమయంలో టర్కీకి ఆపరేషన్ టర్కీ పేరుతో భారత్ సాయం అందించినా మానవత్వం లేకుండా వ్యవహరించిన టర్కీకి భారతీయులు ఈ రకంగా బుద్ధి చెబుతున్నారు.
చైనా వస్తువులను కూడా...
అలాగే చైనా వస్తువులను కూడా బహిష్కరించాలంటూ భారతీయులు ఎక్కువ మంది పిలుపు నిస్తున్నారు. పాక్ భారత్ పై దాడికి దిగిన సమయంలో పాకిస్తాన్ కు ఆయుధ సామాగ్రితో కూడిన అతిపెద్ద కార్గో విమానాన్ని చైనా పంపినట్లు వార్తలు రావడంతో చైనా అంటే కూడా భారతీయులు మండిపడుతున్నారు. పాక్ కు చైనా కూడా ఆయుధాలు పెద్దయెత్తున సరఫరా చేసిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో టర్కీతో పాటు చైనా వస్తువులను కూడా బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చే వారి సంఖ్య ఎక్కువయింది. అయితే బీజింగ్ ఈ వార్తలను ఖండించింది. కానీ చైనా వస్తువులను కొనుగోలు చేయవద్దంటూ కొందరు అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాక్ కు ఎవరు మద్దతిచ్చినా తమకు శత్రువులుగానే పరిగణిస్తామంటూ భారత్ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పంపుతున్నారు. కానీ చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు పాక్ కు సరఫరా చేయలేదని చెబుతుంది.
Next Story

