Fri Dec 05 2025 15:54:25 GMT+0000 (Coordinated Universal Time)
Encounter : మావోయిస్టు కీలక నేత చలపతి మృతి..మరికొందరు కూడా?
చత్తీస్ గడ్ - ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో కీలక మావోయిస్టులు నేతలు మరణించారని సమాచారం.

చత్తీస్ గడ్ - ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో కీలక మావోయిస్టులు నేతలు మరణించారని సమాచారం. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకూ పథ్నాలుగు మంది మరణించారని పోలీసులు ధృవీకరించారు. అందులో మావోయిస్టు అగ్రనేత చలపతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదరు కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల నుంచి మావోయిస్టుల ఏరివేత ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో జరుగుతుంది. భద్రతాదళాలు జల్లెడపడుతున్నాయి. అనేకసార్లు ఎన్ కౌంటర్లు జరిగాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తూ మావోయిస్టులను ఏరేవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మృతుల సంఖ్య...
అధికారికంగా పథ్నాలుగు మంది మావోయిస్టులు మరణించారని చెబుతున్నప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిసింది. మృతి చెందిన మావోయిస్టుల వద్ద నుంచి పెద్దయెత్తున ఆయుధాలు, ఇతర సామగ్రిని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ మృతి చెందిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉన్నారని తెలిసింది. చలపతిపై రివార్డు కూడా ఉంది. వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు మావోయిస్టులు జరిపిన చర్చల్లో కూడా చలపతి కీలకంగా వ్యవహరించారు. చలపతి అలియాస్ జయరామ్ మరణించాడని ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలిసింది.
కోటి రూపాయల రివార్డు...
చలపతిపై కోటి రూపాయల వరకూ రివార్డు కూడా ఉంది. చలపతితో పాటు మావోయిస్టు కీలక నేత మనోజ్ కూడా ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరి మృతిని అధికారికంగా పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఛత్తీస్ గఢ్ అడవుల్లోనే మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అక్కడ ఏరివేత కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా సాగుతుంది. భద్రతాదళాలు అక్కడే మకాం వేసి మావోయిస్టుల కదలికలను గమనించి మెరుపుదాడికి దిగుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. మావోయిస్టుల సానుభూతి పరుల నుంచి అందుతున్న సమాచారం కూడా ఈ ఎన్ కౌంటర్ లకు దోహద పడుతుందని తెలియవచ్చింది.
Next Story

