Fri Dec 05 2025 14:12:12 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : శబమరిమల బంగారం మాయం కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మాయమైన బంగారం విషయంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మాయమైన బంగారం విషయంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసులను కేరళ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శబరిమల ఆలయంలోని సైడ్ ఫ్రేమ్ ల నుంచి బంగారం మాయమయినట్లు ఆరోపణలు రావడంతో గత కొద్ది రోజులు కేరళ అసెంబ్లీని కూడా కుదిపేసింది. ప్రతిపక్ష పార్టీలు దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ ఘటనపై కేరళ హైకోర్టు న్యాయమూర్తులు రాజా విజయరాఘవన్ వి., కె.వి.జయకుమార్‌ల బెంచ్ ఈ ఆదేశం జారీ చేసింది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో బంగారం మాయమైందని కనిపిస్తోందని కోర్టు గమనించిందని వ్యాఖ్యానించింది.
ఆరువారాల్లో పూర్తి నివేదిక...
విజిలెన్స్ నివేదిక ప్రకారం సుమారు 474.9 గ్రాముల బంగారం ఆలయానికి బంగారు పూత చేయించేందుకు యూనికృష్ణన్ కు అప్పగించారని, కానీ ఆ బంగారం తిరిగి ట్రావెన్ కోర్ దేవస్థఆనం బోర్డుకు అందించారనే రికార్డు లేదని కోర్టు వెల్లడించింది. ఇదే అంశంపై ముందే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. విజిలెన్స్ నివేదికను టీడీబీకి పంపి, వారు రాష్ట్ర పోలీసు చీఫ్‌కు అందజేయాలని కూడా ఆదేశించింది. దర్యాప్తు నిర్పక్షపాతంగా, వేగంగా సాగి నిందితులు శిక్షకు గురయ్యేలా చూడాలని కోర్టు సూచించింది. ఆరు వారాల్లో పూర్తి నివేదిక, ప్రతి రెండు వారాలకు ఒకసారి పురోగతి నివేదిక సమర్పించాలని కూడా కేరళ హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు వివరాలు విచారణ పూర్తయ్యే వరకు ప్రజలకు లేదా మీడియాలో వెల్లడించ కూడదని కూడా కేరళ కోర్టు స్పష్టం చేసింది.
Next Story

