Mon Apr 06 2026 01:22:41 GMT+0530 (India Standard Time)
ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించొచ్చు
లెస్బియన్ జంట అధీలా నస్రీన్-ఫాతిమా నూరా కలిసి జీవించేందుకు కేరళ హైకోర్టు అనుమతినిచ్చింది.

తల్లిదండ్రుల నుండి దూరంగా ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు సహజీవనం చేయడానికి కేరళ హైకోర్టు ఓకే చెప్పింది. లెస్బియన్ జంట అధీలా నస్రీన్-ఫాతిమా నూరా కలిసి జీవించేందుకు కేరళ హైకోర్టు అనుమతినిచ్చింది. వారు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన అనంతరం.. అమ్మాయిలిద్దరూ కలిసి జీవించొచ్చని తీర్పు చెప్పింది. ఫాతిమాను ఆమె తల్లిదండ్రులు అపహరించారని, కన్వర్షన్ థెరపీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ అధీలా గత వారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది వారి వ్యక్తిగత వ్యవహారమంటూ కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో అధీలా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమకు కలిసి జీవించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు. విచారించిన కోర్టు వారిద్దరూ కలిసి జీవించేందుకు అనుమతినిచ్చింది.
తన భాగస్వామి ఫాతిమా నూరాను వారి కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా హింసించారని అధీలా నస్రీన్ తెలిపింది. ఆరు రోజుల క్రితం నూరాను ఆమె బంధువులు కిడ్నాప్ చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. ఫాతిమా నూరాను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పిటిషనర్ నస్రీన్ ను కూడా కోర్టుకు పిలిపించారు. వారు కలిసి జీవించడం నిషేధం కాదని జస్టిస్ వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
22 ఏళ్ల నస్రిన్ మరియు 23 ఏళ్ల నూరా సౌదీ అరేబియాలో చదువుకునే రోజుల నుండి ప్రేమలో ఉన్నారు. వీరి బంధాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. తరువాత, గ్రాడ్యుయేషన్ తర్వాత, జంట కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ చర్యను ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. కలిసి జీవించాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వీరిద్దరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. LGBTIQ+, ఇతర అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్న కోజికోడ్‌లోని వనజా కలెక్టివ్ అనే ఎన్జీవోలో ఆశ్రయం పొందారు. కోర్టు తీర్పు నేపథ్యంలో వీరిద్దరూ కలిసి జీవించేందుకు మార్గం సుగమమైంది.
Next Story

