Kerala : రహదారిపైనే ప్రాణాలు కాపాడిన వైద్యులు.. షేవింగ్ బ్లేడ్ తో సర్జరీ..స్ట్రాతో శ్వాస అందించి మరీ?
కేరళలో వైద్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యుఒడికి చేరుకుంటున్న వారిని రోడ్డుపైనే రక్షించగలిగారు

కేరళలో వైద్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యుఒడికి చేరుకుంటున్న వారిని రోడ్డుపైనే రక్షించగలిగారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. తీవ్రంగా గాయపడిన రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు ఆసుపత్రికి తరలించే సమయం లేకపోవడంతో రోడ్డుపైనే అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ థియేటర్ లేదు, పరికరాలు లేవు, క్షణాలు మాత్రమే ఉన్నాయి. అయినా వెంటనే నిర్ణయం తీసుకుని చికిత్సకు దిగారు.మొబైల్ ఫోన్ టార్చ్ల వెలుతురులో, స్థానికులు, పోలీసులు సహకరించడంతో రోడ్డే తాత్కాలిక ఆపరేషన్ థియేటర్‌గా మారింది. శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి షేవింగ్ బ్లేడ్, జ్యూస్ పేపర్ స్ట్రాతో శ్వాస మార్గం ఏర్పాటు చేసి ప్రాణాలు నిలబెట్టారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో వలియకులం వద్ద స్కూటర్, బైక్ ఢీకొన్నాయి. స్కూటర్‌పై వెళ్తున్న కొల్లం జిల్లా వాసి లిను, బైక్‌పై ఉన్న విపిన్, మను రోడ్డుపై పడిపోయారు. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ గాయపడ్డారు.

